– మంత్రి అరుణ్‌రాజ్
సాక్షి,చైన్నె: ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల కోసం , నమూనాల (సాంపిల్స్) పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండే కష్టాలకు ముగింపు పలకడానికి తమిళనాడు ప్రభుత్వం ఒక కొత్త డిజిటల్ విధానాన్ని తీసుకు రానున్నది. నలం ఏఐ అనే కొత్త మొబైల్ యాప్ ద్వారా అపాయింట్‌మెంట్‌లు బుక్ చేసుకుని మందులు పొందే సదుపాయాన్ని త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్‌రాజ్ ప్రకటించారు.నలం ఏఐ యాప్ ప్రయోజనాలను స్థానికంగా ఆయన వివరించారు.ఈ యాప్ ద్వారా రోగులు ముందుగానే స్లాట్ రిజర్వ్ చేసుకుని, నిర్ణీత సమయానికి వచ్చి మందులు మరియు పరీక్షల నమూనాలను అందించవచ్చు అని వివరించారు.ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య రద్దీ సమయాల్లో ఆస్పత్రుల్లో పొడవైన క్యూలలో నిలబడే పనిలేకుండా సమయం ఆదా అవుతుందన్నారు. తాంబరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీ ఆసుపత్రిగా మార్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందని, సీఎంతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో డెంగీ కేసులు వెలుగుచూడటంతో దోమల నిర్మూలన పనులను ముమ్మరం చేశామని మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచామని, నిరంతర పర్యవేక్షణ జరుగుతోందన్నారు.
3 రోజుల కస్టడీకి అన్బిల్ మహేష్
– సీసీబీ తీవ్ర విచారణ
సాక్షి, చైన్నె: ప్రైవేట్ పాఠశాలలకు నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు మంజూరు చేయడానికి రూ. 400 కోట్ల వరకు లంచాలు సేకరించారన్న ఆరోపణలపై అరెస్టయి పుళల్ జైలులో ఉన్న డీఎంకే మాజీ మంత్రి అన్బిల్ మహేష్ ను 3 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ చైన్నె అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ ఎల్.ఎస్. సత్యమూర్తి ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుండి నవంబర్ 4వ తేదీ వరకు 3 రోజుల పాటు అన్బిల్ మహేష్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు కస్టడీలో విచారించడానికి అనుమతించారు. విచారణ సమయంలో ఆయనను శారీరకంగా గానీ, మానసికంగా గానీ హింసించకూడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విచారణ సమయంలో న్యాయవాది హాజరైనా, ఆయన సంభాషణలు వినలేని దూరంలో ఉండాలని పేర్కొన్నారు. జైలు వంటగదిలో ఆయన కోరిన ఆహారాన్ని తయారుచేసి ఇవ్వాలని, లేని పక్షంలో ఇంట్లో వండిన ఆహారాన్ని అనుమతించాలని ఆదేశించారు. కాగా, ఈసందర్భంగా అన్బిల్ మహేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ , జప్తు చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలను తిరిగి ఇవ్వాలని కోరిన దరఖాస్తులపై విచారణను ప్రత్యేక కోర్టు నవంబర్ 5వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.
జైళ్లలో భద్రత పటిష్టం
– మాజీ డీజీపీ జె.కె. త్రిపాఠి నేతృత్వంలో కమిటీ
సాక్షి, చైన్నె: తేని జిల్లా జైలు నుండి 17 మంది ఖైదీలు తప్పించుకున్న తీవ్ర ఘటన నేపథ్యంతో సీఎం జోసఫ్ విజయ్ రాష్ట్ర జైళ్ల భద్రతా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జైళ్లలో భద్రతా లోపాలను అరికట్టడానికి, భద్రతను యుద్ధ ప్రాతిపదికన పటిష్టం చేయడానికి మాజీ డీజీపీ జె.కె. త్రిపాఠి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈకమిటీకి చైర్మన్ జె.కె. త్రిపాఠి, ఐపీఎస్ (రిటైర్డ్), సభ్యులుగా జైళ్ల శాఖ అదనపు డైరెక్టర్ కె. శంకర్, మాజీ డిప్యూటీ ఐజీ ఎస్. రాజేంద్రన్ (రిటైర్డ్)లను నియమించారు. తేని జిల్లా జైలు, ఇతర ప్రాంతాల్లో ఖైదీలు పారిపోవడానికి దారితీసిన భద్రతా లోపాలపై సమగ్ర విచారణ జరపడంఈకమిటీ ప్రధాన బాధ్యతగా ఆదేశించారు.అలాగే, ప్రస్తుతం ఉన్న భద్రతా నిర్మాణం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, సాంకేతిక లోపాలు , సిబ్బంది కేటాయింపులను క్షుణ్ణంగా పరిశీలించడం కూడా అప్పగించారు. దేశవ్యాప్తంగా, విదేశాల్లో అమలులో ఉన్న ఉత్తమ భద్రతా పద్ధతులను పరిశీలించి, తమిళనాడు జైళ్లలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి సమగ్ర సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే విధంగా కమిటీకి సూచనలు ఇచ్చారు. జైళ్ల భద్రతను యుద్ధప్రాతిపదికన పటిష్టం చేయాలని, విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుని జవాబుదారీతనం ఖరారు చేయాలని సీఎం జోసఫ్ విజయ్ ఆదేశించారు. ఇదిలా ఉండగా పుళల్ జైలలో ఖైదీలు తప్పించుకునేందుకు అక్కడి భద్రతా లోపాలు కారణంగా తాజాగా విచారణలో తేలాయి. ఇక్కడి సోలార్ ఫెన్సింగ్ ఇప్పటికి కూడా పనిచేయనట్టు సమాచారం.


