తిరువళ్లూరు: ద్విచక్ర వాహనంలో ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణమైన సమయంలో ప్రమాదానికి గురైన భార్యభర్త వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన స్తానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు రాజాజీపురం ప్రాంతానికి చెందిన సుందరం(50). ఇతని భార్య సంగీత(42), వీరికి ఇద్దరు ఆడపిల్లలు వున్నారు. వీరు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల వద్ద టిఫిన్ సెంటర్ను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరూ కలిసి ఆలమాధిలోని ఆలయానికి వెళ్లి ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. ద్విచక్ర వాహనం తామరపాక్కం వద్ద వస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ సుందరం సంగీత ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంగీత అక్కడిక్కడే మృతి చెందగా, సుందరం తీవ్రంగా గాయపడిన క్రమంలో అతడికి తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి చైన్నె రాజీవ్గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన క్రమంలో మృతి చెందాడు. వెంగల్ పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. కాగా రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు. వారు రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది.


