సాక్షి,చైన్నె: అమెజాన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఈ పండుగ సీజన్లో ఎకో స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్ప్లేలు, ఫైర్ టీవీ స్ట్రీమింగ్ స్టిక్స్, ఫైర్ టీవీ ఇన్–బిల్ట్ స్మార్ట్ టీవీలపై మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన తగ్గింపులను అందిస్తున్నట్టు స్థానికంగా శనివారం ప్రకటలించారు. ఈ సేల్‌లో పరికరాలను కొనుగోలు చేసే వినియో గదారులకు అమెజాన్ సరికొత్త అలెక్సా ప్లస్‌కి ఉచితంగా ఎర్లీ యాక్సెస్ లభిస్తుందని ప్రకటించారు.అమెజాన్ జెనరేటివ్ ఏఐ ఆధారంగా పనిచేసే ఈ అలెక్సా ప్లస్, వినియోగదారులతో ఎంతో సులువుగా, సహజంగా మాట్లాడగలదని, అలాగే రోజువారీ పనులను సులభతరం చేసేలా రూపుదిద్దుకుందని వివరించారు.
కొరుక్కుపేట: ఆలూరి రామస్వామి, పూర్ణావతి తెలుగు చారిటబుల్ ట్రస్ట్ తరపున దసరా సందర్భంగా చిన్నారుల చేత భరతనాట్య ప్రదర్శన జరిగింది. చైన్నె వలసర వాక్కంలోని గంగై అమ్మన్ ఆలయంలో చేసిన నృత్య ప్రదర్శన లో చిన్నారులు షెర్లీ, ప్రేనికా, లక్షణ లు తమదైన శైలిలో విఘ్నేశ్వరుడు, అమ్మవారి పాటలకు నత్యం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఏవీ శివకుమారి చిన్నారుల అభినందిస్తూ ఘనంగా సత్కరించారు.
అన్నానగర్: తెన్కాసి జిల్లా కడయం సమీపంలోని రామచంద్రపురం ప్రాంతానికి చెందిన పళనిస్వామి భార్య జానకి బాప్పా (82). వారి దత్తపుత్రుడు శివ. ఇతను వివాహితుడు. పళనిస్వామి కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. అందువల్ల జానకి బాప్పా తన కొడుకు, కోడలితో కలిసి నివసిస్తున్నారు. ఈ స్థితిలో, ఇతని ఇంట్లో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందువల్ల, శివ తన భార్య పుట్టింటికి వెళ్లి అక్కడే ఉండిపోయాడు. ఆ ఇంట్లో జానకి బాప్పా ఒక్కరే ఒంటరిగా నివసిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం, శివ రామచంద్రపురంలోని తన తల్లి ఇంటికి వెళ్లాడు. అక్కడ, జానకి బాప్పా తలపై తీవ్రమైన కత్తి కోతలతో హత్య చేయబడి కనిపించారు. అంతేకాకుండా, జానకి బాప్పా మెడలో ఉన్న గొలుసుతో సహా 12 పౌండ్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఆలంగుళం సమీపంలోని కుత్తపంచాన్ గ్రామానికి చెందిన గణేషన్ (30)ని నిందితుడిగా నిర్ధారించి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 11 సవర్ల నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సాక్షి,చైన్నె: ఫొటో షూట్ కోసం వచ్చిన ఓ బాలికపై చైన్నెలో లైంగిక దాడి జరిగింది. బాధితురాలు జిల్లా బాలల సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. చైన్నె కాసిమేడు ప్రాంతానికి చెందిన ఫోటోగ్రాఫర్ త్యాగు (32), రాయపురం నియోజకవర్గంలోని టీవీకే 50వ వార్డు నిర్వాహకుడిగా ఉన్నాడు. మోడలింగ్‌పై ఆసక్తి ఉన్న తనకు తెలిసిన ఓ మహిళ కుమార్తెను ఫొటో షూట్ పేరిట నమ్మ బలికాడు. ఆమెను త్యాగు పుదుచ్చేరికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక గది తీసుకుని ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు తొలుత పుదుచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి నుంచి స్పందన లేక పోవడంతో జిల్లా బాలల సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు త్యాగు కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే, ఆ బాలిక తల్లికి 14 ఏళ్లుగా ఈ త్యాగు స్నేహితుడిగా ఉన్నట్టు విచారణలో తేలింది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
తిరువొత్తియూరు : చైన్నె అశోక్ నగర్, 100 అడుగుల రోడ్డులో అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఒక యువకుడు తల నలిగిపోయిన స్థితిలో మరణించి పడి ఉన్నాడు. దీనిని చూసి దిగ్భ్రాంతి చెందిన ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు వెంటనే పాండి బజార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఈఎస్ఐ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వ్యక్తి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉండవచ్చు. ఇతను గిండి నుండి అశోక్ నగర్ వైపు మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అదుపు తప్పి కింద పడిపోయాడని, ఆ వాహన చక్రాల కింద చిక్కుకుని మరణించాడని ప్రాథమిక విచారణలో తేలింది. మరణించిన యువకుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవాడు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. మోటార్ సైకిల్‌ను ఢీకొట్టి ఆపకుండా పారిపోయిన వాహనం గురించి ఆరా తీస్తున్నారు.


