సాక్షి, చైన్నె: విజయదశమి, ఆయుధ పూజ సందర్భంగా శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో, చైన్నె నుండి తమ స్వస్థలాలకు జనం బయలుదేరి వెళ్లారు. చైన్నెలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో శుక్రవారం రాత్రి, శనివారం అర్థరాత్రి వరకు కిటకిటలాడాయి. తమిళనాడు వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 14,963 ప్రత్యేక బస్సులు, కేవలం చైన్నె నుంచే 6,199 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సులు కోయంబేడు, కిలాంబాక్కం, మాధవరం, మారమలై నగర్ తదితర తాత్కాలిక బస్సు స్టేషన్ల నుండి రోడ్డెక్కించారు. కిలాంబక్కం బస్ స్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా ఏర్పాట్లు, ప్రయాణికులు, సిబ్బందికి రూ. 10 విలువైన ఉచిత నీటి సీసాలు అందజేశారు. రద్దీని నియంత్రించడానికి 14 బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.
తనిఖీలు – ట్రాఫిక్ నియంత్రణ..
రవాణా శాఖ మంత్రి పార్తీబన్ పోరూర్ టోల్ బూత్ ప్రాంతంతో పాటు వివిధ తాత్కాలిక బస్ స్టేషన్లను స్వయంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోరూర్ టోల్ బూత్ వద్ద బస్సుల రాకపోకలకు అడ్డుగా ఉన్న భారీ ఆక్రమణలను తొలగించాలని, ట్రాఫిక్ సులభతరంగా సాగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రయాణికుల భద్రత, సహాయం కోసం మాధవరం బస్ స్టాండ్, కోయంబేడు ఎన్నికల సంఘం కార్యాలయం, కోయంబేడు బస్ స్టాండ్ ప్రవేశ ద్వారం, ఓమ్ని బస్ స్టాండ్, పోరూర్ టోల్ బూత్ అనే 5 ప్రధాన ప్రాంతాల్లో పోలీసు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం వందలాది పోలీసు సిబ్బంది, అసిస్టెంట్ కమిషనర్లు, ఇన్స్పెక్టర్లు విధుల్లో ఉన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం 8 అంబులెనన్స్లను అందుబాటులో ఉంచారు. భారీ వాహనాలను నగరంలోకి అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. ఇక, రైళ్లు సైతం కిటకిటలాడాయి. విమానాశ్రయంలో సైతం రద్దీ విపరీతంగా ఉండడం గమనార్హం.


