గవర్నర్ కై లాష్‌నాథన్
సాక్షి, చైన్నె: పుదుచ్చేరి ప్రభుత్వం, స్థానిక సంస్థల శాఖ సంయుక్తంగా స్వచ్ఛ భారత్ దివస్ వేడుకలను శుక్రవారం కంబన్ కలైరంగంలో ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె.కై లాష్‌నాథన్ విశిష్ట సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు పురస్కారాలు అందజేశారు. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన సమాచార పుస్తకాన్ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ వీధుల్లోని చెత్తను శుభ్రం చేయడానికి పరిమితమైన పథకం కాదని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచనను, బాధ్యతను ప్రతి ఒక్కరిలోనూ కలిగించే ప్రజా ఉద్యమమని తెలిపారు. మహాత్మా గాంధీ స్వయంగా చేతిలోకి పొరక, బకెట్ పట్టుకుని పారిశుద్ధ్య పనులు చేశారని గుర్తుచేశారు. ఆయన దృష్టిలో పరిశుభ్రత అనేది కేవలం కార్మికుల బాధ్యత మాత్రమే కాదుని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం ఎంత ముఖ్యమో, స్వచ్ఛత కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు.
10 ఏళ్ల మైలురాయి
గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించారని గవర్నర్ తెలిపారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఇది దేశవ్యాప్తంగా అపార విజయాన్ని సాధించిందని చెప్పారు. ఇందులో భాగంగా పుదుచ్చేరి, కారైక్కాల్, మాహే, ఏనామ్ పురపాలక సంఘాలు, 10 కొమ్యూన్ పంచాయతీలు బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా రూపాంతరం చెందాయని వెల్లడించారు. దీనికి కారణమైన పారిశుద్ధ్య కార్మికులకు సగౌరవంగా నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి, తాత్కాలిక స్పీకర్ అన్బళగన్, మంత్రులు నమశ్శివాయం, మల్లాది కృష్ణారావు, రాజవేలు, శివకొళుందు, ఎంపీ సెల్వగణపతి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కార్మికుల వేతనం రూ.424లకు పెంపు
పుదుచ్చేరిలో ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల దినసరి వేతనాన్ని రూ.290 నుంచి రూ.424కు పెంచుతున్నట్లు సీఎం ఎన్.రంగసామి ప్రకటించారు. ఈ పెంచిన వేతనాలు గతేడాది జూన్ నుంచి వర్తింపజేసి (అరియర్స్‌తో సహా) చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యంగా ఉండటానికి పరిసరాల పరిశుభ్రత అత్యంత ముఖ్యమన్నారు. మన ఇల్లు, వీధులు, నగరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై విద్యార్థుల ద్వారా ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు స్థానిక సంస్థల శాఖ ఒక నెల రోజుల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పారిశుద్ధ్య పనులు చేయడానికి కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం నిర్దేశిత సంఖ్యలో సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.
కార్మికుల ఆరోగ్య భద్రత
60 ఏళ్లు పైబడిన వారు కూడా ఎంతో కష్టపడి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని, వారి కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందని సీఎం ఎన్.రంగసామి తెలిపారు. కాంట్రాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులకు తగిన రక్షణ పరికరాలు అందించడంతో పాటు వారికి రోగాలు రాకుండా ముందస్తు వైద్య చికిత్సలు, ఆరోగ్య తనిఖీలు ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతమైన పుదుచ్చేరిని స్వచ్ఛంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక సంస్థల పాత్ర కీలకమని అన్నారు.


