వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేలూరు కోట మైదానంలోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ లీలాఅలెక్స్, మేయర్ సుజాత, కార్పొరేషన్ కమిషనర్ క్యాత్రిన్ శరణ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ఖాధీ భవన్‌లో ఖదర్ ప్రత్యేక విక్రయాలను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖాధీ భవన్‌లో రూ.90 లక్షల విక్రయాలు జరిపేలా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిపారు. అదే విధంగా దీపావళి పండుగను పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఖద్దర్‌పై 30 శాతం, పట్టు వస్త్రాలపై 30 శాతం, ఉల్లన్‌కు 20 శాతం, పాలిస్టర్ దుస్తులకు 30 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోదుల వారసుల సంఘం గౌరవాధ్యక్షుడు పీపీ చంద్ర ప్రకాష్ అధ్యక్షతన సమరయోధుల వారసులు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తిరువణ్ణామలై కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ పూల మాల వేసి నివాళులర్పించారు. జిల్లా వ్యాప్తంగా గాంఽధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి స్వీట్లు పంచి పెట్టారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ చిత్ర పటాన్ని ఉంచి పూల మాల వేసి స్వీట్లు పంచి పెట్టారు. అన్నదాన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.


