సాక్షి, చైన్నె : రాష్ట్రంలో కొత్తగా అమలులోకి వచ్చిన తాయ్ మామన్ బంగారు ఉంగరం పథకం కారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగినప్పటికీ, వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్‌రాజ్ వెల్లడించారు. ఆయన శుక్రవారం స్పందిస్తూ మాతాశిశు ఆరోగ్య సంరక్షణ విభాగంలో తమిళనాడు సాధించిన పురోగతిని వివరించారు. 2015–16 నాటి రికార్డుల ప్రకారం రాష్ట్రంలో నమోదైన మొత్తం 9.47 లక్షల ప్రసవాల్లో అత్యధికంగా 6.31 లక్షల ప్రసవాలు (67 శాతం) ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగాయన్నారు. 2025–26 నాటికి రాష్ట్రంలో మొత్తం ప్రసవాల సంఖ్య 7.80 లక్షలకు తగ్గగా, అందులో 4.15 లక్షల ప్రసవాలు (53శాతం) ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగాయని వివరించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రులు 6.31 లక్షల ప్రసవాల వరకు స్వీకరించే పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.
మౌలిక సదుపాయాల పెంపు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి వైద్యులు, అనస్థీషియాలజిస్టులు, నర్సులు, ఇతర అవసరమైన సౌకర్యాలను ప్రతి ఏటా పెంచుకుంటూ వచ్చామని తెలిపారు. అత్యవసర ప్రసూతి, శిశు సంరక్షణ సేవలను 24 గంటలూ అందించేందుకు రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లతో 130 ప్రత్యేక కేంద్రాలను ఉన్నతీకరించి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. డీఎంకే వైద్య విభాగ కార్యదర్శి డాక్టర్ ఎజిలన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సరైన ఆర్థిక కేటాయింపులు, మౌలిక సదుపాయాలు పెంచకుండా తాయ్ మామన్ బంగారు ఉంగరం పథకం ద్వారా అదనపు రోగులకు చికిత్స ఎలా అందిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విమర్శల నేపథ్యంలోనే మంత్రి అరుణ్‌రాజ్ వైద్యారోగ్య శాఖ సంసిద్ధతపై స్పష్టత ఇచ్చారు.


