క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

ఆంఽధ్రా నుంచి ఇసుక తరలించిన ఇద్దరి అరెస్టు సదస్సులు విద్యార్థులకు ఎంతో ఉపయోగం విద్యార్థుల శ్రమదానం రక్తదానం ప్రాణదానంతో సమానం ఎస్‌ఐపై హత్యా యత్నం ●డ్రైవర్‌ సహా ముగ్గురి అరెస్ట్‌

తిరుత్తణి: ఆంధ్రా నుంచి టిప్పర్‌ లారీలో తిరుత్తణికి ఇసుక తరలించిన ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని ఆంధ్ర రాష్ట్రం నగరి కుశస్థలి నది నుంచి అక్రమంగా ఇసుక తరలించి తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తిరువళ్లూరు జిల్లా ఎస్పీ సాయి ప్రణీత్‌కు రహస్య సమాచారం అందింది. ఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం గురువారం రాత్రి చైన్నె – తిరుపతి జాతీయ రహదారిలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తారుపట్ట మూసి తిరుత్తణి వైపు వెళుతున్న టిప్పర్‌ లారీని తనిఖీ చేయగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని సీజ్‌ చేసి ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో తిరుత్తణి బైపాస్‌ రోడ్డు మార్గానికి చెందిన లారీ యజమాని మహేంద్రన్‌, అరక్కోణం ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్‌ అజయ్‌ని అరెస్టు చేశారు.

అన్నానగర్‌: సదస్సుల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు అనేక విషయాలు తెలుసుకుంటారని తిరువేర్కాడులోని ఎస్‌ఏ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.వెంకటేశ్వరాజు తెలిపారు. కళాశాలలో శుక్రవారం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ విభాగం, పరిశోధన, అభివృద్ధి విభాగం సంయుక్తంగా బహుముఖ సుస్థిరత, ఇంజినీరింగ్‌ విద్య అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఇందులో ఆవడిలోని డాక్టర్‌ శకుంతల రంగరాజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కామర్స్‌ డీన్‌ కె.అరుణ, సవిత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ టెక్నలాజికల్‌ సైన్సెస్‌ జనరల్‌ కామర్స్‌ విభాగాధిపతి, ప్రొఫెసర్‌ వి.అరుల్‌ మేరీ రెక్సీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సెమినార్‌ సెషన్లను ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ నిర్వహించారు. 274 మంది ప్రతినిధులు పాల్గొనగా, 66 పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఉత్తమ పరిశోధనా పత్రాలకు అవార్డులు, పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు.

తిరుత్తణి: తిరుత్తణి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపు 26న ప్రారంభంమైంది. ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంప్‌ ఆపీసర్‌ లీలా మనోహర్‌ ఆధ్వర్యంలో 25 మంది విద్యార్థులు శ్రమదానం చేశారు. పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రత చేశారు. డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎనిమిది రోజులు నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంప్‌ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆదర్శ గ్రామసభ నిర్వహించి పంచాయతీరాజ్‌ విధులు, బాధ్యతలపై హెచ్‌ఎం బాలసుబ్రహ్మణ్యం అవగాహన కల్పించి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

కొరుక్కుపేట: రక్తదానం ప్రాణదానంతో సమానమని చైన్నె తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు రంగినేని వెంకటరమణ, కార్యదర్శి బి.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం చైన్నె తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అథుల్య జెరియాట్రిక్‌ కేర్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. అసోసియేషన్‌ సభ్యులు, వలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సలు, ప్రమాదాల సమయంలో రక్తం అవసరమైన వారికి దాతల నుంచి అందే రక్తం ఎంతో విలువైనదని నిర్వాహకులు తెలిపారు. ఎవరికి రక్తం అందుతుందో తెలియకపోయినా.. ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టగలమనే భావనతో రక్తదాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

తిరువొత్తియూరు: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎస్‌ఐని ట్రాక్టర్‌తో ఢీకొని హత్య చేసేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తంజావూరు జిల్లా పాపనాశం తాలూకా మెలాట్టూరు కోడుకిలి సమీపంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు మెలాట్టూరు పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఐ ముత్తువేల్‌ (58), కానిస్టేబుల్‌ రామన్‌ గురువారం రాత్రి గస్తీ చేపట్టారు. ఆ సమయంలో మెలాట్టూరుకు చెందిన రామలింగం (67) భూమి నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను నిలిపారు. డ్రైవర్‌ ట్రాక్టర్‌ను వేగంగా నడిపి ఎస్‌ఐ ముత్తువేల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కానిస్టేబుల్‌ రామన్‌ వెంటనే మెలాట్టూరు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ పోతుమణి, మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐని తంజావూరులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం గురువారం రాత్రి ట్రాక్టర్‌ నడిపిన డ్రైవర్‌ను, ట్రాక్టర్‌ యజమాని కుమార్‌ (50), భూమి యజమాని రామలింగంను అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement