వేలూరు: తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపంలోని కస్తంబాడి గ్రామంలో బావి తవ్వుతుండగా మట్టి గడ్డలు పడడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. కస్తంబాడి గ్రామంలో తంజై అనే రైతు భూమిలో గత రెండు నెలలుగా కొత్త బావి తవ్వుతున్నారు. పనుల్లో కరుంగాలికుప్పం గ్రామానికి చెందిన వెంకటేశన్ కుమారుడు సెల్వమణి(35), సహదేవన్ కుమారుడు రవీంద్రన్(50)తో పాటు నలుగురు కూలీ లు పాల్గొంటున్నారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మట్టి బాగా నానింది. గురువారం సాయంత్రం మట్టి గడ్డలు కూలి బావిలో పడ్డాయి. లోపల ఉన్న రవీంద్రన్, సెల్వమణి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆరణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాలను ట్రాక్టర్‌లో తరలించడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసు లు ట్రాక్టర్‌ను అడ్డుకుని మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు అధిక సంఖ్యలో బావి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కార్మికుల మృతిలో అనుమానాలున్నాయని, సమగ్ర విచారణ జరపాలని కోరారు. పోలీసులు ట్రాక్టర్ యజమానితో పాటు బావి యజమానిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
మృతిచెందిన కార్మికులు సెల్వమణి, రవీంద్రన్‌ల(ఫైల్)


