వేలూరు: గ్రామ సభల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ లీలాఅలెక్స్ తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని ప్రభు త్వం ఆదేశించింది. అందులో భాగంగా వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గంలోని సేవూరు గ్రామ పంచాయతీలో కలెక్టర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించి వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ గ్రామ సభ నిర్వహించాలని ఆదేశించామన్నారు. సమస్యలను ఆయా సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు తెలియజేసి వాటిలో అర్హులైన వారికి పథకాలను అందజేస్తామన్నారు. కొన్నింటిని సంబందిత అధికారులతో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం సేవూరు పంచాయతీలో తాగునీటి సమస్యతో పాటు పెన్షన్‌ల కోసం అనేక మంది వినతి పత్రాలు సమర్పించారని, వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా కాట్పాడి తాలూకా అమ్ముండి, పెరుముగై తదితర పంచాయతీల్లో ఆయా సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. వీటిలో అధికంగా పెన్షన్‌లకు సంబందించి వినతులు రావడంతో వాటిని ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.
తిరువళ్లూరులో..
తిరువళ్లూరు: గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించారు. పంచాయతీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు లేకుండానే సభలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి ఏటా గాంధీ జయంతి రోజు గ్రామసభలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా 526 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. సభలకు వీఏఓ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తప్ప మరెవ్వరూ హాజరుకాలేదు. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేదని వాపోయారు. సేలై, ఈకాడు, మనవాలనగర్, తిరువూరు, సెవ్వాపేట, నత్తంబేడు తదితర గ్రామసభల్లో పాల్గొన్న ప్రజలు తమ సమస్యలను పరిస్కరించాలని కోరుతూ నిరసన గళం విప్పారు. ఈ క్రమంలో అధికారులు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పళ్లిపట్టులో..
పళ్లిపట్టు : గాంధీ జయంతి సందర్భంగా పళ్లిపట్టు యూనియన్‌లోని 33 గ్రామ పంచాయతీల్లో బీడీఓ స్టాలిన్ నేతృత్వంలో గ్రామసభలు నిర్వహించారు. కరింబేడులో నిర్వహించిన గ్రామసభకు పంచాయతీ కార్యదర్శి మణి అధ్యక్షత వహించారు. డిప్యూటీ బీడీఓ మురళి పాల్గొన్నారు. ఇందులో గ్రామీణులు పాల్గొని వెట్రి పథకం ద్వారా కుగ్రామాల్లో కనీస సదుపాయాల కల్పన పనులు చేయాలని తీర్మానించారు. కొళత్తూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభకు హాజరైన మహిళలు వీబీజీ రామ్‌జీ పథకంలో కూలి రూ.60 మాత్రమే చెల్లిస్తున్నట్లు, ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పనులు చేస్తున్నా కూలి దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెడియం పంచాయతీ గ్రామసభలో అధికారులు అతి తక్కువ సంఖ్యలో పాల్గొనడంతో ఆగ్రహం చెందిన మహిళలు నిరసన తెలిపారు. ఇదే విధంగా 33 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి పలు పనులు చేయడానికి తీర్మానం ఆమోదించారు.
ఎల్లప్పనాయుడుపేటలో నల్లజెండాలతో నిరసన
గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎల్లప్పనాయుడు పేటలో నిర్వహించిన గ్రామసభ ఉద్రిక్తతకు దారితీసింది. తిరుపతి–చైన్నె జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 80 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. ఎల్లప్పనాయుడుపేట వద్ద పాసింగ్ వేను నిర్మించాలని స్థానికులు ఎప్పుడు నుంచో కోరుతున్నారు. పాసింగ్‌వే లేకపోవడం వల్ల అంత్యక్రియలకు సైతం ఆరు కిమీల దూరం వెళ్లి వెనక్కి రావాల్సి వస్తోందని వాపోయారు. స్థానికుల వినతులపై అధికారులు స్పందించకపోవడంతో శుక్రవారం ఉదయం నిర్వహించిన గ్రామసభను బహిష్కరించి నల్లజెండాలతో నిరసన తెలిపారు.


