తమిళసినిమా: ఉత్తర చైన్నె నేపథ్యంలో చిత్రం అనగానే గొడవలు, కొట్టుకోవడాలు, రక్తపాతం వంటి చిత్రాలే గుర్తుకొస్తాయి. అవేవీ లేకుండా నిజమైన ఉత్తర చైన్నె ప్రజల ఇతివృత్తంతో రూపొందించిన ప్రేమ, సెంటిమెంట్, కుటుంబ అనుబంధాలు వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం ఆల్ పాస్ అని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఒన్స్ స్టెప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మోహన.ఆర్ నిర్మించిన ఈ చిత్రానికి మైదీన్ కథ, దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. నిరంగళ్ మూండ్రు, తరుణం చిత్రాల ఫేమ్ దుశ్యంత్ కథానాయకుడు. ఇందులో లియో చిత్రంలో కీలక పాత్రను పోషించిన బిగ్ బాస్ ఫేమ్ జనని నాయకిగా నటించారు. జయప్రకాశ్, సెంథికుమారి, దర్శకుడు సుబ్రమణ్య శివ, వినోదిని, ప్రసన్న బాలచందర్, మోహన.ఆర్, అరువి మదన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. దర్శకుడు మూర్తి, కలైయరసన్ కన్నసామి హాస్య భూమికలను పోషించారు. ఈ చిత్రానికి దిల్ రాజు ఛాయాగ్రహణం ను, జేమ్స్ వసంతన్ సంగీతాన్ని అందించారు. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే కథా చిత్రం కావడంతో షూటింగ్‌ను ఆ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసినట్లు దర్శకుడు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయిన ఆల్ పాస్ చిత్రాన్ని అక్టోబర్ 9వ తేదీన విడుదల చేయనున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


