కానరాని 49 మంది జాడ | - | Sakshi
Sakshi News home page

కానరాని 49 మంది జాడ

Oct 3 2026 1:20 AM | Updated on Oct 3 2026 1:20 AM

● నేపాల్‌ వెళ్లిన వారి ఆప్తుల కన్నీటి వేదన ● ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలి

సాక్షి, చైన్నె : కై లాస యాత్ర నిమిత్తం చైన్నె సమీపంలోని క్రోమ్‌పేట్‌ నుంచి నేపాల్‌ వెళ్లిన 49 మంది యాత్రికుల సమాచారం లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 35 రోజులకు పైగా తమ వారి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆ కుటుంబాల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. ఈ విషయమై దాదాపు 50 మందికి పైగా బాధిత బంధువులు శుక్రవారం క్రోమ్‌పేట్‌లోని అసోసియేటెడ్‌ ట్రావెల్స్‌ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు. వారి కథనం మేరకు.. కై లాస యాత్ర కోసం ఆగస్టు 14న వీరంతా నేపాల్‌ వెళ్లారు. ఆగస్టు 26 వరకు వారితో ఫోన్‌ సంప్రదింపులు సాగాయి. చైనా–నేపాల్‌ సరిహద్దులోని పౌరసత్వ ఽధ్రువీకరణ కేంద్రం సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో వారు చిక్కుకుపోయినట్లు సమాచారం అందింది. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నెల రోజులకు పైగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు

యాత్రికుల సమాచారాన్ని సేకరిస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై స్పష్టత ఇవ్వలేదని బంధువులు తెలిపారు. బాధితుల బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ, వాటికి అనుసంధానమైన సెల్‌ ఫోన్లు వారి వద్దే ఉండిపోవడంతో ఏటీఎం సేవలు, ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపలేకపోతున్నారు. కొన్ని కుటుంబాల్లో సంపాదించే ఏకై క వ్యక్తి యాత్రకు వెళ్లడంతో ఇక్కడ ఉన్న పిల్లల చదువులు, రోజువారీ ఇంటి ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రభుత్వానికి బంధువుల విజ్ఞప్తి

49 మంది పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన, అధికారిక సమాచారాన్ని అందించడంతోపాటు కుటుంబాల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర ఆర్థిక సహాయం అందించాలని బాధితుల బందువులు కోరారు. బాధితుల బ్యాంక్‌ ఖాతాల్లోని సొమ్మును కుటుంబ సభ్యులు చట్టబద్ధంగా ఉపయోగించుకునేలా ప్రత్యేక సడలింపులు లేదా విధానాలను అమలు చేయాలని విన్నవించారు. ఈ విషయంలో సీఎం నేరుగా జోక్యం చేసుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలని బాధితుల బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement