తమిళసినిమా: కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్ చిత్రాల వరుస విజయాలతో జోరు మీదున్న స్టార్ హీరో సూర్య. ప్రస్తుతం తన 47వ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. నటి నజ్రియా నాయకి గా నటిస్తున్న ఈ చిత్రానికి జీతు మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, సూర్య తన 48 వ చిత్రానికి జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞాన వేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే సూర్య 49వ చిత్రం గురించి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి హెచ్.వినోద్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆయన ఇంతకుముందు ప్రస్తుత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హీరోగా నటించిన జననాయగన్ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తదుపరి సూర్య హీరోగా నటించనున్న చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ చిత్రంలో బాలీవుడ్ నటి వామిక గబ్బీ నాయకిగా నటించనున్నట్లు తెలిసింది. ఈమె ఇంతకు ముందు దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన డీసీ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. ఈయన ఇంతకు ముందు సూర్య హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం కరుప్పుకు సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముంది.


