కోల్డ్ కాల్
చిత్రంలో
ఓ దృశ్యం
తమిళసినిమా: కొత్త వాళ్లతో చేసే చిత్రాల్లో ఫ్రెష్ నెస్ ఉంటుందని, వారిలో ఫైర్ ఉంటుందని,కథ, కథనాల్లో వైవిధ్యం ఉంటుందన్నది సినీ ప్రముఖుల భావన. అలాంటి ఫైర్ ఉన్న నూతన కళాకారులతో రూపొందిన తాజా చిత్రం కోల్డ్ కాల్. తంబిదురై దర్శకత్వంలో వాక్ త్రోవ్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కేశవ్ మూర్తి నిర్మించిన ఫీల్ గుడ్ కథా చిత్రం ఇది. సిద్ధుమూలి మణి, శ్రీ వైష్ణవ్, సంతోష్ ఎస్‌ఏ, కృష్ణ విజయ్ చంద్రన్ తదితర నూతన నటులు కథానాయకులుగా నటించిన ఇందులో వి.శ్రీకాంత్, బాలాజీ రాజశేఖర్, అమిత రంగనాథ, నిషా హెగ్డే, కీర్తన తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ముఖ్యంగా విక్రయ నిర్వాహకుల జీవన చర్యలు, వారి సమస్యలకు హాస్యాన్ని జోడించి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించామని చెప్పారు. జెన్‌జీ తరం ఈ చిత్రాన్ని తమకు ఓన్ చేసుకుంటుందని వెల్లడించారు. నలుగురు స్నేహితుల ప్రేమ, పోరాటం, వినోదం వంటి జనరంజకమైన అంశాలతో రెండు గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందన్నారు. జీఎన్ శరవణన్ ఛాయాగ్రహణం, ప్రణవ్ గిరిధర్ సంగీతం అందించిన ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని యాక్షన్ రియాక్షన్ సంస్థ ద్వారా జినీష్ ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నట్లు వివరించారు.


