సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం వేకువజామున 2.55 గంటలకు ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–17/ఈఓఎస్–05 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాకెట్‌లోని మూడు దశలు అద్భుతంగా పనిచేశాయి. ముందుగా ఊహించిన దానికంటే ఉపగ్రహాన్ని కక్ష్య దూరం మరింతగా పెరిగింది. భూమికి దగ్గరగా అంటె పెరిజీ 170 కి.మీ అనుకున్నారు. ఇది 171 కి.మీకు పెరిగింది. అదే విధంగా 28,934 కి.మీ అపోజిని ముందుగా నిర్దేశించుకున్నారు. ఈ దూరం సుమారు 31 వేల కిలోమీటర్లుకు పెంచి మరీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు పెరిజీ 171 కిలోమీటర్లు దూరాన్ని అధికంగా, 31 వేల కిలోమీటర్లు అపోజిని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ మరో నాలుగైదు విడుతలుగా భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. అయితే భూస్థిక కక్ష్యలో నుంచి పని చేయబోయే మొట్టమొదటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇదే కావడం విశేషం.
● 51.70 మీటర్లు పొడవున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–17 రాకెట్ 420.5 టన్నుల బరువుతో నిప్పులు చిమ్ముతూ నింగివైపు దూసుకెళ్లింది.
మొదటిదశ : నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లులో 160 టన్నుల ద్రవ ఇంధనం, కోర్ అలోన్ దశలో 139 ఘన ఇంధనంతో మొదటి దశను ఘన, ద్రవ ఇంధనాలను మిళితం చేసి 151.9 సెకెండ్లలో మొదటి దశను విజయవంతంగా పూర్తిచేశారు.
● రాకెట్ శిఖరభాగంలోని ఉపగ్రహానికి అమర్చిన హీట్‌షీల్డ్స్ 234.3 సెకెండ్లకు మొదటి దశ రెండోదశ ప్రయాణం మధ్యలోనే విడిపోయాయి.
● రెండోదశ: 40 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో రెండోదశను 295.5 సెకెండ్లకు పూర్తి చేశారు.
● మూడోదశ:– క్రయోజనిక్ దశలో 15 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1106.60 సెకెండ్లకు కటాఫ్ చేశారు.
ఆతరువాత ఈ దశలోనే 1,117 కిలోలు బరువు కలిగిన ఈఓఎస్–05 ఉపగ్రహాన్ని 1115.60 సెకెండ్లకు (19 నిమిషాలకు) భూమికి దగ్గరగా అంటే పెరిజీ 171 కిలోమీటర్లు, భూమికి దూరంగా అంటే అపోజి 31,934 కిలోమీటర్లు ఎత్తులోని దీర్ఘ వృత్తాకార కక్ష్యలో జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు.


