ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి
అన్నానగర్ : మధురై ప్రధాన రహదారి పై, కామరాజ్ మిడిల్ స్కూల్ వీధికి ఎదురుగా సుమారు 10 కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున, ఒక గుర్తుతెలియని వ్యక్తి అక్కడకు వచ్చిన ఒక ఇంటి గోడపైకి రెండు పెట్రోల్ బాంబులు విసిరాడు. నిద్రలో ఉన్న ప్రజలు ఆ శబ్దానికి కేకలు వేస్తూ బయటకు పరుగెత్తారు.ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనానికి కూడా నిప్పంటుకోగా స్థానికులు మంటలను ఆర్పివేశారు. చోళవందన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పెట్రోల్ బాంబు విసిరిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. పెట్రోల్ బాంబు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి తలకు నిప్పు అంటుకుని అక్కడినుంచి పారిపోయాడు. ఈ దశ్యం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన పాత కక్షల వల్ల జరిగిందా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.కొన్ని నెలల క్రితం ఈ ప్రాంతంలో జరిగిన రెండు పెట్రోల్ బాంబు ఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ఘటన చోళవందన్‌లో కలకలం సృష్టించింది.
రోడ్డుప్రమాదంలో
వివాహిత మృతి
తిరువళ్లూరు: వివాహమైన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ అత్తికావనూరుకు చెందిన సతీష్(25) పెద్దపాళ్యం సమీపంలోని జయపురంలో ఉన్న ప్రవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. చైన్నె నందంబాక్కం పెరియార్ నగర్‌కు చెందిన ఫిలిఫ్‌రాజ్ కుమార్తె కేత్రినతో ఆగస్టు 21న వివాహం జరిగింది. ఈ క్రమంలో సతీష్ తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంలో పెద్దపాళ్యం నుంచి ఇంటికి వెళుతుండగా కేత్రిన హఠాత్తుగా సృహ తప్పి కిందపడిపోయింది. గాయపడిన ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పెళ్లి పేరిట బాలిక కిడ్నాప్
– నిందితుడిపై పోక్సో కేసు
అన్నానగర్: చైన్నె సమీపంలో ఇన్‌న్‌స్ట్రాగామ్ ద్వారా ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన యువకుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. చైన్నెలోని పరంగిమలై ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పరంగిమలై పోలీస్ స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక కోసం గాలిస్తుండగా, కన్యాకుమారి జిల్లా, తోవలైకి చెందిన సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి దివేష్ (19) ఇన్‌న్‌స్ట్రాగామ్ ద్వారా ఆ అమ్మాయిని ప్రేమించాడని వెల్లడైంది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని తెలిసింది. ఆ తర్వాత, తోవలై ప్రాంతంలో కిడ్నాప్ కు గురై, బంధించబడిన బాలికను పోలిసులు రక్షించి, చైన్నెకి తీసుకువచ్చి మహిళా ఆశ్రమానికి అప్పగించారు. దివేష్ ను పరంగిమలై మహిళా పోలీస్ స్టేషన్‌న్‌కు తరలించారు. దివేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసి విచారిస్తున్నారు.
కళాశాలపై నుంచి దూకేశారు!
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని పూందమల్లి సమీపంలో ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాలలో వరుసగా ఇద్దరు విద్యార్థులు భవనంపై నుంచి దూకేయడం కలకలం రేపింది. ఈ ఘటనల నేపథ్యంలో కళాశాల యాజమాన్యం నిరవధిక సెలవు ప్రకటించింది. ముందుగా ఏఐ ద్వితీయ సంవత్సరంవిద్యార్థిని షెరిన్ (19) కళాశాల 5వ అంతస్తు నుంచి గురువారం దూకేసి ఆత్మహత్యకు పాల్పడింది.. తల్లిదండ్రుల ప్రేమ లోపించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు తెలిపారు. మరుసటి రోజు శుక్రవారం మరో విద్యార్థి శశిధరన్ (19) తరగతులు జరుగుతుండగానే 3వ అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. క్రమం తప్పకుండా కళాశాలకు రాకపోవడంతో యాజమాన్యం మందలించడమే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుస ఘటనలతో దిగ్భ్రాంతికి గురైన కళాశాల యాజమాన్యం పరిస్థితులను సమీక్షించి విద్యార్థుల హాస్టల్‌ను ఖాళీ చేయించింది. పోలీసులు రెండు ఘటనలపై కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
మైనర్‌ను పెళ్లి చేసుకున్న
వ్యక్తి అరెస్ట్
వేలూరు: తిరుపత్తూరుకు చెందిన 16 ఏళ్ల బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబీకులు తిరుపత్తూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో తిరుపత్తూరు కోట వీధికి చెందిన మహమ్మద్ ఖాన్ కుమారుడు బిర్యానీ మాస్టర్ రహీమ్ ఆ మైనర్ బాలికను మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి వివాహం చే సుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న రహీమ్‌ను తిరుపత్తూరు కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.


