రామకుప్పం(శాంతిపురం): కర్ణాటకలోని జేకే పురం నుంచి రామకుప్పం వెళ్లే మార్గంలోని రాజుపేట సమీపంలో జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో తమిళనాడు చెందిన వ్యక్తి మృతి చెందాడు. రామకుప్పం పోలీసుల కథనం మేరకు వివరాలు. తిరుపత్తూరు జిల్లాలోని దిగువ వానియంబాడికి చెందిన పార్తీబన్(27) గురువారం బైక్‌పై కర్ణాటకలోని కోటి లింగాలు ఆలయానికి వెళ్లాడు. రాత్రి తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు రాజుపేట సమీపంలో హంద్రీ–నీవా కాలువలో బైకుతో సహా పడిపోయాడు. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన వాహనదారులు రామకుప్పం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ మారెప్ప ఆధ్వర్యంలో పోలీసుల బృందం హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించే సరికి తలకు తీవ్ర గాయాలైన వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. తన జేబులోని వివరాలు, ఫోను ద్వారా మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి పార్థిబన్‌ను గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్‌ఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. శవ పరీక్షల అనంతరం శుక్రవారం మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. కాలువపై ఉన్న వంతెన వద్ద మలుపులో సరైన సూచిక బోర్డులు లేకపోవడం, కాలువ పక్కన కొంతవరకు సైడ్ వాల్ నిర్మించకపోవడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు.


