సమాచారం కోసం అత్యవసర నంబర్లు | - | Sakshi
Sakshi News home page

సమాచారం కోసం అత్యవసర నంబర్లు

Aug 29 2026 12:17 AM | Updated on Aug 29 2026 12:17 AM

ఢిల్లీలో మంత్రుల బృందం తిష్ట

21 మంది సురక్షితంగా రాక

82 మంది కోసం గాలింపు చర్యలు

కుటుంబ సభ్యుల్లో కలవరం

బాధితుల కుటుంబ సభ్యుల సమాచారం కోసం తమిళనాడు ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. భారతదేశం ఉచిత నంబర్‌: 1800 309 3793, ఢిల్లీ కంట్రోల్‌ రూమ్‌ (తమిళనాడు): 92896516712 / 011–24193100 విదేశాల నుంచి (మిస్డ్‌ కాల్‌/వాట్సాప్‌): +91 8069009500గా ప్రకటించారు. బాధితుల కుటుంబాలతో రెవెన్యూ అధికారులు నిరంతరం సంప్రదింపులలో ఉంటూ, అప్‌డేట్స్‌ ఇవ్వడానికి ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ కూడా ఏర్పాటు చేశారు.

సాక్షి, చైన్నె : నేపాల్‌లో చిక్కుకున్న తమిళులను సురక్షితంగా తమిళనాడుకు తీసుకొచ్చేందుకు సీఎం విజయ్‌ ఆదేశాలతో మంత్రులు ఆధవ్‌ అర్జున, రాజ్‌ మోహన్‌, కె.తెన్నరసు, ఆర్‌.వినోద్‌తో కూడిన బృందం ఢిల్లీలో తిష్ట వేసింది. ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రుల బృందం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమై తమిళుల రక్షణ చర్యలపై చర్చించింది.

కాఠ్మాండు వెళ్లేందుకు దక్కని అనుమతి

బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తీసుకుంటున్న చర్యలను విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు మంత్రులకు వివరించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు నేపాల్‌ రాజధాని కాఠ్మాండు వెళ్లేందుకు మంత్రి ఆధవ్‌ అర్జున నేతృత్వంలోని బృందం అనుమతి కోరింది. ఖాట్మండు ప్రాంతంలో మళ్లీ వరద ముప్పు ఉన్నందున తమిళనాడు నుంచి వెళ్లిన మంత్రులకు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఇంకా అనుమతి లభించలేదు. దీంతో ఆచూకీ తెలియని 82 మంది కోసం ఢిల్లీ నుంచి అన్వేషణ మొదలెట్టారు. వీరిలో 36 మంది గల్లంతైనట్టు సమాచారాలు రావడంతో అనేక కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. వీరి వివరాలు తెలియాల్సి ఉందని, వెతికే ప్రక్రియ మందగించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ముమ్మరంగా గాలింపు

వివరాలు, జాడ, సమాచారం లేని 82 మంది కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో కోయంబత్తూరు వడవల్లికి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ చంద్రశేఖరన్‌, పునీత దంపతులు, నంజుండపురం రోడ్డుకు చెందిన విశ్రాంత ప్రభుత్వ వైద్యుడు సురేష్‌ వెంకట్రాచలం, తంగలక్ష్మి దంపతులు, సాయిబాబా కాలనీకి చెందిన ప్రైవేట్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ గాయత్రి, ఆమె కుమార్తె శివంత ఉన్నారు. అలాగే తంజావూరు జిల్లా కుంభకోణానికి చెందిన ట్రావెల్స్‌ నుంచి 57 మంది యాత్రకు వెళ్లగా, వారు ప్రయాణిస్తున్న 3 బస్సుల్లో 2 బస్సులు వరదల్లో చిక్కుకున్నాయి. తంజావూరు జిల్లాకు చెందిన అన్బజగి (67), చిత్ర (61), రంగనాథన్‌ – శివయోగం దంపతులు, రామకుమార్‌ (60), రాజ్‌కుమార్‌ (62), జయంతి (54), రమేష్‌ (68), తయ్యల్‌ నాయకి, లక్ష్మి (64) తదితర 16 మంది వివరాల కోసం అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

ఆప్తుల ఆవేదన

చైన్నె శివారులోని క్రోంపేట, తాంబరం నుంచి వెళ్లిన 49 మంది యాత్రికుల వివరాలు, కనీస సమాచారం కూడా లేకపోవడంతో కుటుంబాలు రోదిస్తున్నాయి. వీరంతా కై లాస యాత్ర ముగించుకుని నేపాల్‌–చైనా సరిహద్దు ప్రాంతంలోని ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయంలో ప్రాసెస్‌ పూర్తి చేసుకునేందుకు వెళ్లినట్టు సమాచారం. ఈ వరదల ధాటికి ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయ భవనం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఈ యాత్రికులు ఎవరూ అందుబాటులోకి రాకపోవడం కలవరం రేపుతోంది. ఈ బృందానికి టూర్‌ గైడ్‌గా ఉన్న ట్రావెల్స్‌ యజమాని కుమారుడు సత్యనారాయణన్‌ ఫోన్‌ కూడా అవుట్‌ ఆఫ్‌ కవరేజ్‌లో ఉంది. ఆయన చివరి సారి ఆగస్టు 26న ఉదయం 8:42 గంటలకు ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు కాంచీపురానికి చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ అధికారులు లతా భానుమతి (63), అరుణ్‌సెల్వం (64), గోపాల్‌, సరస్వతి, అలాగే చంద్రన్‌ కుప్పుసామి (52), మీనాక్షి నందకుమార్‌ (34) కూడా ఈ బృందంలో ఉన్నారు. వీరి పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు కన్నీరుమున్నీరవుతూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గోపాల్‌–సరస్వతి దంపతుల కుమార్తె పొర్‌సెల్వి క్రోమ్‌పేట్‌లోని ట్రావెల్స్‌ సంస్థకు నేరుగా వెళ్లి తన తల్లిదండ్రుల పరిస్థితిపై విచారించారు. సమాచారం అందుకున్న చిట్లపాక్కమ్‌ పోలీసులు, తాంబరం తహసీల్దార్‌ ఆ ట్రావెల్‌ ఏజెన్సీకి చేరుకుని యాత్రికుల పూర్తి వివరాలను సేకరించారు. ఈ బృందంలో చెంగల్పట్టు జిల్లాకు చెందిన ఏడుగురు ఉన్నారని జిల్లా కలెక్టర్‌ ఎం.వీరప్పన్‌ ధ్రువీకరించారు. వీరి ఆచూకీ కోసం నేపాల్‌, చైనా సరిహద్దులు, భారత రాయబార కార్యాలయాలకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లభించకపోవడంతో యాత్రికుల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. పుదుచ్చేరి వాసులు సైతం యాత్రకు వెళ్లిన నేపథ్యంలో వారి జాడ కానరాని దృష్ట్యా, వారి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హోమ్‌ మంత్రి నమశ్శివాయం పంపించారు.

దొరకని 82 మంది వివరాలు

21 మంది సురక్షితం

తమిళనాడుకు చెందిన వారిలో 21 మంది సురక్షితంగా ఉన్నారు. వారిలో 11 మందిని హెలికాప్టర్‌ ద్వారా తిరుతాలిలోని నేపాల్‌ ఆర్మీ క్యాంప్‌నకు, మరో 10 మందిని గుణస ప్రాంతంలోని ఆర్మీ బేస్‌ క్యాంప్‌నకు తరలించారు. వారిలో త్యాగరాజన్‌ (49), సెయ్యప్పన్‌ (69), కలైమతి (67), పళనిరాజన్‌ (56), విజయ పవలేశ్వర్‌ (55), శాంతి (47), మారన్‌ (37), సత్య (38 –కాంచీపురం), కనకసబాయి (68), రత్నకుమార రాధాయి (65), పూంకుజలి (62), మణిమేకలై (65), శివరంజని (46–తిరుచ్చి), కర్పగం (62), వల్లి నాయకి (62), మైథిలి (49) తదితరులు ఉన్నారు. వీరిని చైన్నె తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీరిలో అనేక మంది ఢిల్లీ తమిళనాడు భవన్‌కు సాయంత్రం తీసుకొచ్చారు. అర్ధరాత్రి సమయంలో లేదా, శనివారం ఉదయం వీరంతా స్వస్థలాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement