తిరుత్తణి: తాగునీటి ఎద్దడికి నిరసనగా తిరుత్తణి మున్సిపాలిటీలోని మహిళలు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. దీంతో తిరుత్తణి – చిత్తూరు రాష్ట్ర రహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. తిరుత్తణి మున్సిపాలిటీలోని మురుగూర్‌లో దాదాపు 200 కుటుంబాలకు చెందిన ప్రజలు నివాశమంటున్నారు. తిరుత్తణి నుంచి చిత్తూరు రాష్ట్ర రహదారికి సమీపంలోని మురుగూరు ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. హైవేశాఖ వర్షపు నీటి కాలువ నిర్మాణం కోసం పనులు చేస్తోంది. ఈ క్రమంలో పైపులైన్లు తొలగించి ట్రాక్టర్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఆ నీరు అపరిశుభ్రంగా ఉందని, చాలీచాలని నీటితో ఇబ్బందులు పడుతున్నట్లు మహిళలు వాపోయారు. తాగునీరు సరఫరాకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళలు 50 మందికి పైగా శుక్రవారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. దీంతో తిరుత్తణి– చిత్తూరు రాష్ట్ర రహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. మున్సిపల్ కమిషనర్ కన్నియప్పన్, పోలీసులు మహిళలతో చర్చలు జరిపారు. వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నందున పైపులైన్ల పనులు చేపట్టడంలో ఆలస్యం చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో పైపులైన్లు ఏర్పాటు చేసి తాగునీటి ఎద్దడిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు నిరసనను విరమించారు.


