స్టేను రద్దు చేయండి | - | Sakshi
Sakshi News home page

స్టేను రద్దు చేయండి

Aug 29 2026 12:17 AM | Updated on Aug 29 2026 12:17 AM

5 స్థానాల

ఉపఎన్నికలపై సీఎం కౌంటర్‌ పిటిషన్‌

సాక్షి, చైన్నె: తిరుచ్చి ఈస్ట్‌ సహా ఐదు శాసనసభ నియోజకవర్గాలకు ఉపఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంపై విధించిన స్టేను తొలగించాలని కోరుతూ సీఎం విజయ్‌ తరఫున మద్రాసు హైకోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నందున తిరుచ్చి ఈస్ట్‌, కరూర్‌, విరాలిమలై, పెరుందురై, అంబసముద్రం నియోజకవర్గాలకు ఉపఎన్నికలు ప్రకటించకుండా నిరోధించాలని కోరుతూ పాళయంకోటైకు చెందిన వెంకటాచలపతి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్టే విధించింది. ఎన్నికల కేసులు ముగిసే వరకు ఉపఎన్నికలు ప్రకటించబోమని ఎన్నికల సంఘం కూడా కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్‌ తరఫున కౌంటర్‌ పిటిషన్‌ శుక్రవారం దాఖలైంది. తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ జూన్‌ 17న పిటిషన్‌ దాఖలైందని ఆ పిటిషన్‌లో వివరించారు. అంతకుముందే మే 10న ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. స్పీకర్‌ రాజీనామాను ఆమోదించిన సమయానికి ఎలాంటి ఎన్నికల కేసులు పెండింగ్‌లో లేవన్నారు. ఇప్పటికే ఖాళీ అయిన నియోజకవర్గంపై ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఉపఎన్నికలపై స్టే కోరిన పిటిషనర్‌ అసలు ఆ కేసు వేసిన వ్యక్తి కాదని, కనీసం ఆ నియోజకవర్గ ఓటరు కూడా కాదన్నారు. తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగకూడదనే దురుద్దేశంతో ప్రాథమిక హక్కు లేకుండా ఈ పిటిషన్‌ వేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఉపఎన్నిక నిలిచిపోవడం వల్ల లక్షలాది మంది ప్రజలు ప్రజాప్రతినిధి లేక తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. సదరు ఐదు నియోజకవర్గాల్లో గతంలో జరిగిన ఎన్నికల్లో 20 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేశారని, బహుముఖ పోటీ జరిగినందున, ఓ కేసు ఆధారంగా మరెవరినీ నేరుగా విజేతగా ప్రకటించే అవకాశం లేదన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల సంఘం ఖాళీగా ఉన్న స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాల్సిందేనని సూచించారు. ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని, ఐదు నియోజకవర్గాల ఉపఎన్నికలపై విధించిన స్టేను వెంటనే రద్దు చేయాలని, దురుద్దేశంతో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జరిమానాతో కొట్టివేయాలని సీఎం విజయ్‌ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు.

ఎన్నికల పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు

మరో కేసులో తమ విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌, మంత్రి ఆధవ్‌ అర్జున దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్‌ వేయాలని డీఎంకే అభ్యర్థులు, ఓటర్లను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్‌ నియోజకవర్గం నుంచి సీఎం విజయ్‌ గెలుపొందినట్లు ప్రకటించడాన్ని సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి ఆర్‌.డి.శేఖర్‌, ఓటర్లు దినేష్‌, లక్ష్మీ నరసింహన్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విల్లివాక్కం నియోజకవర్గం నుంచి మంత్రి ఆధవ్‌ అర్జున గెలుపొందడాన్ని సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి కార్తీక్‌ మోహన్‌, ఓటరు శివరాజ్‌ హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు వేశారు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా తమపై దాఖలైన ఈ ఎన్నికల పిటిషన్లను అసలే విచారించకుండా నిరాకరించాలని (సీఎం విజయ్‌, మంత్రి ఆధవ్‌ అర్జున తరఫున హైకోర్టులో కౌంటర్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై శుక్రవారం జస్టిస్‌ వి.లక్ష్మీనారాయణన్‌ విచారణ చేపట్టారు. సీఎం విజయ్‌, మంత్రి ఆధవ్‌ అర్జున దాఖలు చేసిన పిటిషన్లపై డీఎంకే అభ్యర్థులు, ఓటర్లు తమ సమాధానాలను దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్‌ 3వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement