అసెంబ్లీలో ధరల సమరం! | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో ధరల సమరం!

Aug 29 2026 12:17 AM | Updated on Aug 29 2026 12:17 AM

● ప్రతిపక్షాల ఫైర్‌ ● అధికార పక్షంతో సుదీర్ఘ చర్చ, వాగ్వాదం ● కట్టడికి చర్యలు తీసుకుంటామన్న మంత్రి వెంకటరమణన్‌

సైకిళ్లకు రూ.277 కోట్లు

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గ్రాంట్‌ డిమాండ్‌పై మంత్రి సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రజలు 108కి ఫోన్‌ చేసినట్లే, తమిళనాడు ప్రజలు తమ భయాలను పోగొట్టుకోవడానికి తమకు 108 మంది ఎమ్మెల్యేల ను కానుకగా ఇచ్చారని వివరించారు. ప్లస్‌ 1 విద్యా ర్థులకు హెల్మెట్‌, వాటర్‌ బాటిల్‌తో ఆధునిక సైకిళ్లను అందించేందుకు రూ.277 కోట్లు కేటాయించా మని ప్రకటించారు. 5 లక్షల మంది విద్యార్థులకు ఈ సైకిళ్లను పంపిణీ చేసేందుకు 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్‌ పరికరాలను ఏర్పాటు చేశామని, . ప్రతినెలా హాస్టళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

సాక్షి, చైన్నె : రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల వ్యవహారం శుక్రవారం అసెంబ్లీని తాకింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ వ్యవహారం మాటల సమరానికి దారి తీసింది. ధరల కట్టడి చర్యలు తీసు కుంటున్నామని మంత్రి వెంకటరమణన్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉదయం ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయ నిధి స్టాలిన్‌ మాట్లాడుతూ గత 3 నెలల్లో బియ్యం, పప్పులు, నూనె, చక్కెర వంటి వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల నియంత్రణకు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆర్థిక, ఆహార శాఖలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్నాడీఎంకే శాసన సభాపక్ష నేత పళణిస్వా మి, పీఎంకే, కాంగ్రెస్‌, సీపీఐ సభ్యులు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల నుంచి బియ్యం సరఫరా తగ్గిందని తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య అనేక సందర్భాల్లో వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇరాన్‌ యుద్ధమే కారణం

ఆహార శాఖ మంత్రి వెంకటరమణన్‌ సమాధానం ఇస్తూ ఇరాన్‌ యుద్ధం సంక్షోభం వల్ల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగి రవాణా ఖర్చులు పెరగడం వల్ల దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయని తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం 41 నిత్యావసర వస్తువుల ధరలను పర్యవేక్షిస్తోందన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వస్తువులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు హామీ ఇచ్చారు.

సభలో ఎంజీఆర్‌ పాట

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గ్రాంట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి సంపత్‌ కుమార్‌ ఎంజీఆర్‌ నటించిన ఒక సినిమాలోని పాటలోని కొన్ని చరణాలను ఆలపించారు. దీనిపై డీఎంకే ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి సంపత్‌ కుమార్‌ స్పందిస్తూ తాను ఏ దురుద్దేశంతోనూ పాట పాడలేదని, దీన్ని తీవ్ర నేరంగా పరిగణించవద్దని కోరారు. డీఎంకే మాజీ మంత్రి కె.ఎన్‌.నెహ్రూ జోక్యం చేసుకుంటూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖపై ఎంజీఆర్‌కు ఉన్న నిర్లక్ష్య ధోరణిని ఎత్తిచూపేలా మంత్రి మాట్లాడారని విమర్శించారు.

నోయ్యల్‌ నది పునరుద్ధరణ పనులు

అసెంబ్లీల మంత్రి ఆనంద్‌ మాట్లాడుతూ నోయ్యల్‌ నది కోయంబత్తూరు గుండా ప్రవహిస్తూ కరూర్‌ జిల్లా వద్ద కావేరి నదిలో కలుస్తోందన్నారు. దీని పునరుద్ధరణకు రూ.5 కోట్లతో చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అలాగే కొల్లిడం–వెల్లార్‌ నదుల పరిరక్షణకు రూ.972కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.

వన్నియర్ల రిజర్వేషన్లపై చర్చ

శాసనసభలో వన్నీయర్లకు 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్‌ వ్యవహారం, కుల గణన అంశంపై చర్చ జరిగింది. అన్నాడీఎంకే మాజీ మంత్రి సీవీ షణ్ముగం మాట్లాడుతూ వన్నియర్ల రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన కేసుల వెనుక ఉన్న అంశాలను సభ ముందు ఉంచారు.

మంత్రి వన్నియరసు ఉద్వేగం

సామాజిక న్యాయం, సమానత్వం అనే సూత్రాలను తన తండ్రి తనకు పరిచయం చేశారని, ఆ బాటలోనే తాను పయనిస్తున్నానని చెబుతూ మంత్రి వన్ని అరసు అసెంబ్లీలో ఉద్వేగానికి గురయ్యారు. కుల నిర్మూలన పోరాటంలో వీసీకే నేత తిరుమావళవన్‌ ఉద్యమించగా, సీఎం విజయ్‌ కూడా మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. వీసీకే గెలుపునకు కారణమైన డీఎంకే నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. డీఎంకే సభ్యులు తమ నేత తిరుమావళవన్‌కు కృతజ్ఞతలు చెప్పడం లేదన్నారు. ఇందుకు ప్రధాన ప్రతి పక్షనేత ఉదయ నిధి స్టాలిన్‌ స్పందిస్తూ తమ నేతకు, తిరుమావళవన్‌కు మధ్య ఉన్నది ఎన్నికల పొత్తు కాదని, సిద్ధాంతపరమైన బంధమని తెలిపారు. తిరుమావళవన్‌ను తన రాజకీయ గురువుగా అంగీకరిస్తున్నానని తాను అనేకసార్లు చెప్పానని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement