సాక్షి, చైన్నె : డీఎంకే బలోపేతం దిశగా నిర్మాణాత్మక మార్పులకు అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శ్రీకారం చుట్టా రు. ఇందులో భాగంగా పార్టీ పరంగా ఉన్న 77 జిల్లాల సంఖ్యను 110కి పెంచుతూ శుక్రవారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన డీఎంకే మున్ముందు పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా అధ్యక్షుడు స్టాలిన్ చర్యలు తీసుకుంటున్నారు. వివిధ కమిటీలు, ప్రజలు, కేడర్ అభిప్రాయాలు, సూచనలకు అనుగుణంగా నిర్మాణాత్మక మార్పులు చేస్తున్నారు. గత వారం జరిగిన పార్టీ కార్యవర్గంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా శుక్రవారం పలు మార్పులు చేశారు. డీఎంకే అనే మహోద్యమం సిద్ధాంతం, వ్యవస్థాగత నిర్మాణం, కార్యాచరణ, కార్యకర్తలు అనే నాలుగు ప్రధాన స్తంభాలపై నడుస్తున్నట్టు వివరించారు. కాలానికి అనుగుణంగా వీటిని నిరంతరం మెరుగుపరుస్తూ, పదునుపెడుతూ వస్తున్నామన్నారు. ఈనెల 22వ తేదీన జరిగిన పార్టీ నాయకత్వ కార్యవర్గ సమావేశంలో పరిపాలనా సంస్కరణలకు అవసరమైన కీలక నిర్ణయాలను తీర్మానాలుగా ఆమోదించామని గుర్తు చేశారు.
16వ సంస్థాగత ఎన్నికలకు సన్నద్ధం
డీఎంకే ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు సంస్థాగత ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. 16వ ఎన్నికలకు తాజాగా సన్నద్ధమయ్యామని వివరించారు. ఇందులో వ్యవస్థాగత మార్పులు చేసేందుకు తీర్మానించామన్నారు. ఇందులో అత్యంత కీలకమైనది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తీర్మానమని వివరించారు. ప్రస్తుతం ఉన్న 77 జిల్లాల సంఖ్యను 110కి పెంచి, ఏయే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ జిల్లా పరిధిలోకి రావాలనేది నిర్ధారించే అధికారాన్ని కార్యవర్గం తనకు అప్పగించిందన్నారు. ఇందుకు అనుగుణంగా కసరత్తులు పూర్తి చేశామన్నారు.
110 జిల్లాలు
పార్టీ పునర్వ్యవస్థీకరణ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాత తమిళనాడులోని నియోజకవర్గాలను 110 జిల్లాలుగా విభజించి ప్రకటిస్తున్నానని స్టాలిన్ వివరించారు. జనాభా ప్రాతిపదికన అత్యధిక జనాభా కలిగిన షోళింగనల్లూర్ నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా చేశామన్నారు. కొత్తగా ప్రకటించిన ఈ 110 జిల్లాల ప్రస్తుత కార్యదర్శులు, పార్టీ కేంద్ర నాయకత్వం పంపే ప్రతినిధి సమక్షంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన టౌన్, యూనియన్, ప్రాంతం, పట్టణం, వార్డు, బ్రాంచ్ కమిటీల విభజన సిఫార్సులను 15 రోజుల్లోగా కేంద్ర నాయకత్వానికి అందజేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కొన్ని జిల్లాలలో చిన్న చిన్న నియోజకవర్గాలను మూడింటిని ఏకం చేసి ఒక జిల్లాగా, పెద్ద జిల్లాలను రెండింటిని ఏకం చేస్తూ ఒక జిల్లాగా విభజిస్తూ జాబితాను స్టాలిన్ ప్రకటించారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన చైన్నెని డీఎంకే పార్టీ పరంగా 10 జిల్లాలుగా నిర్ణయించారు. ఇందులో రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న షోళింగనల్లూరును ప్రత్యేక జిల్లాగా ప్రకటించారు.


