తేలని సీట్ల లెక్క! | - | Sakshi
Sakshi News home page

తేలని సీట్ల లెక్క!

Mar 3 2026 8:11 AM | Updated on Mar 3 2026 8:11 AM

● పనిచేయని ‘పీయూష్‌’ తంత్రం ● ఢిల్లీకి పళణి స్వామి ● అన్నాడీఎంకే కూటమిలో సీట్ల వివాదం

ఢిల్లీకి పళణి

సీట్ల పంపకాలు రచ్చకెక్కిన నేపథ్యంలో సోమవారం ఉదయాన్నే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి హుటా హుటిన ఢిల్లీ వెళ్లడం గమనార్హం. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ నిమిత్తం పళని స్వామి ఢిల్లీ వెళ్లినట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.గతంలో అమిత్‌ షాతో జరిపిన చర్చల మేరకు బీజేపీ, ఇతర మిత్రులకు 70లోపు సీట్లు ఇస్తామని తేల్చినట్టు, అయితే, తాజాగా ఆసంఖ్య పెంచిన నేపథ్యంలో అమిత్‌ షావద్దే పంచాయతీ పెట్టి వ్యవహారాన్ని ముగింపు పలికే విధంగా పళణి డిల్లీ వెళ్లినట్టుగా చెబుతున్నారు. బీజేపీ సీట్ల పంపకాల ఒప్పందాలు ఢిల్లీలోనే ముగించి వచ్చే దిశగా ఉరకలు తీసినట్టు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో ఎలాంటి చర్చలు, రచ్చలకు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.

సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే – బీజేపీ కూటమిలో సీట్ల పంపకాల లెక్కలు కొలిక్కిరాలేదు. బీజేపీ అత్యధిక సీట్లను ఆశిస్తుండడం అన్నాడీఎంకేను సంకటంలో పడేసినట్లయ్యింది. కేంద్ర మంత్రి, బీజేపీ తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జ్‌ పీయూష్‌ గోయల్‌ వ్యూహాల తంత్రాలు పనిచేయనట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో సోమవారం ఉదయాన్నే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి హుటా హుటిన ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. వివరాలు.. రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వం, జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్‌డీఏ నేతృత్వం అంటూ తమిళనాట ప్రతి పక్ష పార్టీలతో కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇందులో అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే(అన్బుమణి), వాసన్‌ తమిళ మానిల కాంగ్రెస్‌, దినకరన్‌ అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం, ఐజేకే, పుదియనిధి అంటూ పలు పార్టీలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో అన్నాడీఎంకే నుంచి బీజేపీ, అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం మరింతగా అధిక సీట్లను ఆశిస్తుండటం కూటమిలో సీట్ల చర్చ రచ్చకెక్కినట్లయ్యింది.

పీయూష్‌ నేతృత్వంలో మంతనాలు

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మదురైలోపర్యటించిన విషయం తెలిసిందే. ఈ బహిరంగ సభ వేదికపై నుంచి కూటమిలోని పార్టీల నేతలందరూ తమ ఐక్యతను చాటుకున్నారు. మోదీ ఢిల్లీ వెళ్లినానంతరం ఇదే ఉత్సాహంతో మిత్రులందరూ మదురైలోని ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. పీయూష్‌ గోయల్‌ నేతృత్వంలో జరిగిన ఈ భేటికి పళణి స్వామి, అన్బుమణి, దినకరన్‌, జికేవాసన్‌ తదితరమిత్రులందరూ హాజరయ్యారు. 234 స్థానాలలో మిత్రులకు 60 నుంచి 70 స్థానాల వరకు కేటాయించేందుకు అన్నాడీఎంకే సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, బీజేపీ అన్నాడీఎంకే కంచుకోటలైన నియజకవర్గాలను గురి పెట్టి 40 స్థానాల వరకు ఆశిస్తున్నట్టు, అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం సైతం 30 స్థానాలను ఆశిస్తుండం, పీఎంకే 25 స్థానాలు, తమిళ మానిల కాంగ్రెస్‌ 10, ఐజేకే ఏడు స్థానాల కోసం పట్టుబడటంతో సీట్ల పంపకాలు కాస్త రచ్చకెక్కినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ప్రధాన మిత్రులతో పాటుగా చిన్న పార్టీలతో కలుపుకుని సుమారు 115 సీట్లను ఆశిస్తుండటం అన్నాడీఎంకేకు మింగుడు పడనట్టు చర్చ జరుగుతోంది. తాము కేవలం 120 నుంచి 125 స్థానాలలో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉండటాన్ని అన్నాడీఎంకే నేతలు అంగీకరించనట్టు తెలిసింది. అయితే, బీజేపీకి 25 లోపు, పీఎంకేకు 17 లోపు, అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగంకు ఆరు, తమిళ మానిల కాంగ్రెస్‌కు 3, ఐజేకేకు 2 ,ఇ తర మిత్రులకు తలా ఓ సీట్లు ఇచ్చి, మిగిలిన 165 స్థానాలలో తాము పోటీ చేస్తామని అన్నాడీఎంకే స్పష్టం చేసినట్టు సంకేతాలువెలువడ్డాయి. దీంతో ఈ చర్చలు అసంతృప్తికరంగా సాగడంతో నేతలందరూ తలా ఓ దారి అన్నట్టుగా బయటకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement