సాక్షి, చైన్నె : తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సోమవారం మాసి బ్రహ్మోత్సవ రథోత్సవ వేడుక కనుల పండువగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలి వచ్చిస్వామివారిని దర్శించుకున్నారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏటా ఏటా స్కంధ షష్ఠి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతాయి. అలాగే మాసి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. సాగర తీరంలోని ఈ ఆలయానికి నిత్యం భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అందుకే ఇక్కడి ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంటారు. మాసి ఉత్సవాలు ఇక్కడ గత వారం నుంచి జరుగుతోన్నాయి. రోజూ ఆలయంలో విశిష్ట పూజలు జరుగుతూ వచ్చాయి. సోమవారం రథోత్సవ వేడుక జరిగింది. వేకువ జాము నుంచి ఆలయంలో సుబ్రమణ్యస్వామి వారికి వళ్లి, దేవానై అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిగాయి. వళ్లి, దేవానై సమేత సుబ్రమణ్య స్వామి వారిని రథంపై అధిష్టంపజేశారు. భక్తులు హోరం..హర నామస్మరణ నడుమ రథోత్సవం కనుల పండువగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు రథోత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. రథోత్సవం సందర్భంగా తిరుచెందూరు పరిసరాలలో తూత్తుకుడి జిల్లా యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాటు చేసింది. ఆలయం పరిసరాలలోనే కాకుండా, సముద్ర తీరంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా మాసి మఘం సందర్భంగా తమ పితృ దేవుళ్లకు పిండ తర్పణం ఇవ్వడానికి జనం తరలి రావడంతో చైన్నె నుంచి కన్యాకుమారి వరకు సముద్ర తీరాలు కిటకిటాలాడాయి.


