– ఇరాన్ పై అమెరికా దాడులు ఆపాలని రెండోరోజూ కొనసాగిన నిరసనలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో కేంద్రం ఆదేశాలతో నిఘా కట్టుదిట్టం చేశారు. వాహనాల తనిఖీలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇక యుద్ధం ఆపాలని నినదిస్తూ రెండవ రోజు సోమవారం కూడా పలుచోట్ల నిరసనలు హోరెత్తాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తో పశ్చిమాసియా దేశాలలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. దుబాయ్, ఖతార్, సౌదీ, కువైట్ దేశాలలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకు పడుతుండడంతో ఆందోళన రెట్టింపు అయింది. అనేక చోట్ల దాడులు హోరెత్తుతుండడంతో ఆ దేశాలలోని తమ ఆప్తులు, బంధువులు, పిల్లల క్షేమంపై తమిళనాడులోని కుటుంబాలలో కలవరం పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధం ఆపాలన్న నినాదంతో ఆందోళనలు రాజుకుంటున్నాయి. చైన్నెలో సోమవారం మనిదనేయమక్కల్‌కట్చి నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నాగుర్ దర్గా వద్ద షియా ముస్లింలు ఏకమై నిరసనకు దిగారు. దాడులలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేని చిత్ర పటాలను చేతబట్టి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. అలాగే తేని, వేలూరు, దిండుగల్, తిరునల్వేలి, కోయంబత్తూరులలో నిరసనలు చోటు చేసుకున్నాయి. మైనారిటీ సంఘాలు, పార్టీలే కాదు, వీసీకే , కొంగు ఇలంజర్ పేరవై, ముక్కళత్తోర్ పులిపడై తదితర పార్టీల నేతృత్వంలో సైతం యుద్ధం ఆపాలంటూ నిరసలు చేశాయి. అదే సమయంలో నిరసనల రూపంలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో నిఘాను కట్టుదిట్టం చేసింది. వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా రెండో రోజుగా చైన్నె నుంచి 36 విమాన సేవలు రద్దు అయ్యాయి. అలాగే, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరుల నుంచి సైతం పశ్చిమాసియా దేశాలకు విమాన సేవలను రద్దు చేశారు. విమానాల రద్దుతో సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్లిన తమిళనాడు ప్రభుత్వ ప్రధాన ఖాజీ మౌలానా ఉస్మాన్ మోహిద్దీన్ తనను స్వదేశానికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సమాచారం పంపించారు.
నిరసనలో మైనారిటీ, వీసీకే నేతలు


