సాక్షి, చైన్నె: అంతర్జాతీయ పురుషుల అందాల పోటీల్లో భారత ప్రతిభ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక మిస్టర్ ఆఫ్ ది గ్లోబ్–2026 పోటీల్లో చైన్నెకి చెందిన యువకుడు కదిర్ వినాయక్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ వివరాలను సోమవారం స్థానికంగా ప్రకటించారు. 2025లో తమిళనాడు మోడల్స్ అసోసియేషన్ నిర్వహించిన మ్యాన్ ఆఫ్ తమిళనాడు టైటిల్‌ను కదిర్ గెలుచుకున్నారు. ఆ తర్వాత ఐకానిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఆయన్ను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేసింది. ఫిలిప్పీన్స్‌లో 10 రోజుల పాటు జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో 15కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. కళలు, సంస్కృతి, శారీరక దృఢత్వం, మేధాశక్తిని పరీక్షించే రౌండ్లలో కదిర్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. విజయం సాధించిన అనంతరం కదిర్ వినాయక్ మాట్లాడుతూ తమిళ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. కేవలం అందాల పోటీలకే పరిమితం కాకుండా, పిల్లల హక్కులు, వారి రక్షణ , ప్రపంచ పర్యాటక రంగ అభివృద్ధి కోసం తాను కృిషి చేస్తానని ప్రకటించారు. నటనపై తనకు ఉన్న మక్కువను కదిర్ ఈ సందర్భంగా బయటపెట్టారు. భవిష్యత్తులో తాను సినిమాల్లో రాణించాలని కోరుకుంటున్నానని, త్వరలోనే తనను వెండితెరపై చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.


