తమిళసినిమా: రేడియో జాకీగా పరిచయం అయ్యి, ఆ తరువాత బుల్లితెరపై ప్రత్యక్షమైన రియోరాజ్ ఆపై సినీ రంగప్రవేశం చేసి పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈయన ఈ మధ్య హీరోగా నటించిన జో చిత్రం ప్రేక్షకుల ఆదరణను అందుకుంది. అదే విధంగా ఇటీవల ఈయన నటించిన ఆన్బావం పొల్లాదదు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం కథానాయకుడిగా బిజీగా ఉన్న రియోరాజ్ ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తి రివర్ రూట్ స్టూడియోస్ పతాకంపై ఏకంగా రెండు చిత్రాలను నిర్మిండానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ మొదటి చిత్రాన్ని కథిరవన్ దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. ఇందులో రియోరాజ్‌తో పాటు వరుణ్. కేజీ, ప్రముఖ యూట్యూబర్ నిషాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనికి శక్తి సుబ్రమణియన్ ఛాయాగ్రహణం, దేవ్ ప్రకాశ్ రేవన్ సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. రెండవ చిత్రానికి కే.శివమునీశ్వరన్ దర్శకత్వం వహించనున్నారని చెప్పారు. ఈయన జో ,ఆన్బావం పొల్లాదదు చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశారని, కొన్ని చిత్రాల్లో నటించినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణం అన్నది తన కల అని,అందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని అన్నారు. ప్రతిభావంతులైన కథాకారులను ప్రోత్సహించే విధంగా మంచి కంటెంట్‌తో కూడిన చిత్రాలను నిర్మిస్తానని చెప్పారు. ఈ చిత్రాలకు రెడ్ రాక్ పిక్చర్స్, మాలీ అండ్ మాన్వీ మూవీమేకర్స్ సంస్థలు పెట్డుబడి పెడుతున్నారని చెప్పారు. కాగా ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు రియోరాజ్ పేర్కొన్నారు.


