సినీ నటి జెనిలీయా దేశ్‌ముఖ్
వీఐటీలో ముగిసిన రివేరా–26
వేలూరు: విద్యార్థులే భారతదేశ భవిష్యత్తు అని సినీ నటి జెనీలియా దేశ్‌ముఖ్ అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలో గత నాలుగు రోజులుగా జరిగిన రివేరా–26 కళాజాతా ఆదివారం రాత్రితో ముగిసింది. నాలుగు రోజులపాటు జరిగిన వివిధ పోటీల్లో ఓవరల్ చాంపియన్ షిప్ సాధించిన వివిధ విద్యార్థి బృందాలకు చాంపియన్‌షిప్ కప్పుతో పాటు సర్టిఫికెట్లను వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్ అధ్యక్షతన సినీ నటి జెనీలియా దేశ్‌ముఖ్ అందజేశారు. వేలూరు వీఐటీలో రివేరా గత నెల 26వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు జరిగింది. ముగింపు కార్యక్రమంలో జెనిలీయా దేశ్‌ముఖ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్ విశ్వనాథన్ మాట్లాడుతూ వీఐటీలోని ముఖ్య కార్యక్రమాల్లో రివేరా ముఖ్యమైనదన్నారు. అందులోభాగంగా గత 20 సంవత్సరాలుగా రివేరా అంతర్జాతీయ కళాజాతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీఐటీ కరపత్రాలు, పరిశోధనలు విడుదల చేయడంలో ముందంజలో ఉందన్నారు. మొత్తం 40 భాషలు మాట్లాడే విద్యార్థులు ఇక్కడ ఉన్నారన్నారు. ఇక్కడ విద్యను అందజేయడంతో పాటు పరిశోధనలు, క్రీడలు, సంప్రదాయం, క్రీడా పోటీల్లో రాణించడం కోసమే రివేరా అంతర్జాతీయ కళాజాతాలు ప్రతి సంవత్సరం జరిపిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలతోపాటు సుమారు 20 రాష్ట్రాలకు చెందిన 20 వేల మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఇందుకోసం రూ.25 లక్షలు విలువ చేసే బహుమతులు అందజేసినట్లు తెలిపారు. సినీనటి జెనీలియా దేశ్‌ముఖ్ మాట్లాడుతూ వీఐటీ యూనివర్సిటీలోని విద్యార్థులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. జీవితంలో ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉంటే తప్పకుండా విజయం సాధించగలరన్నారు. అనంతరం రివేరా–26 అన్ని క్రీడా పోటీల్లో చాంపియన్ షిప్ సాధించిన విద్యార్థులకు జెనీలియా దేశ్‌ముఖ్ బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్ విశ్వనాథన్, శేఖర్ విశ్వనాథన్, కార్యనిర్వహణ డైరెక్టర్ సంధ్య పెంటారెడ్డి, ప్రొచాన్సలర్ పార్థసారథి మల్లిక్, రిజిస్ట్రార్ జయ భారతి పాల్గొన్నారు.


