నేడు పుదుకోట్టైకు అమిత్ షా
సాక్షి, చైన్నె: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం పుదుకోట్టైలో పర్యటించనున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం బీజేపీ వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. తమిళనాడులో డీఎంకేను గద్దెదించే విధంగా అమిత్ షా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. చైన్నెలో ఆయన తిష్ట వేసి రాజకీయ వ్యవహారాలను వేగవంతం చేయనున్నట్టు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితులలో ఆదివారం ఆయన పుదుకోట్టైలో పర్యటించనుండడం ప్రాధాన్యతకు దారి తీసింది. మదురై నుంచి కొన్ని నెలల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ రాష్ట్ర పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. తమకు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ నైనార్ పర్యటనలు సాగాయి. చివరి పర్యటన పుదుకోట్టైలో ముగియనుంది. దీంతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనేందుకు అమిత్ షా నిర్ణయించారు. ఆదివారం జరిగే బహిరంగ సభ కోసం తిరుచ్చికి వచ్చే అమిత్ షా, ఇక్కడి విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పుదుకోట్టై వెళ్లారు. ఇక్కడి హెలిపాడ్ నుంచి సభా స్థలి వరకు కొన్ని కిలో మీటర్ల పాటూ రోడ్‌షోను నిర్వహించనున్నారు. కొత్త సంవత్సరంలో అమిత్ షా తొలి పర్యటన విజయవంతానికి బీజేపీ వర్గాలు అన్ని ఏర్పాట్ల చేశాయి. అమిత్ షా రాకతో పుదుకోట్టైలో రాష్ట్ర పోలీసుల యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.


