
మంచిని చూసే తత్వం భువనచంద్రది
కొరుక్కుపేట: అన్నింటిలోనూ మంచిని చూసే తత్వం సినీగేయ రచయిత భువనచంద్రదని సంగీత దర్శకులు విద్యాసాగర్ అన్నారు. మద్రాసు వర్సిటీ తెలుగుశాఖ ఆధ్వర్యంలో ‘భువనచంద్ర సాహితీ సాగరం సృజనాత్మక హరివిల్లు’ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షతన ప్రారంభమైంది. ఆయన మట్లాడుతూ భువనచంద్ర సాహిత్యం ఎంతో సరళంగానూ, సామాజిక దార్శనికతను తెలియజేసే సాహిత్యాన్ని సృష్టించిన గొప్ప కవి అని వ్యాఖ్యానించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ భువనచంద్రపై అంతర్జాతీయ సదస్సు మద్రాసు వర్సిటీలో నిర్వహించడం, 92 పత్రాలతో ఒక ప్రత్యేక సంచికను నాతో ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. నటి ప్రభ మాట్లాడుతూ భువనచంద్ర పాటలు రాయడంతోపాటు తెలుగు సాహిత్యంలో నవలలు, కథలు రాయడం గొప్ప విషయమన్నారు. డా.వనమాల మాట్లాడుతూ భునవచంద్ర అనే పేరులోనే దివ్యత్వమున్నట్లు తెలిపారు. జేకే రెడ్డి మాట్లాడుతూ సినీ సాహితీ క్షేత్రంలో సాహితీ సౌరభాలను ప్రసరించిన నిండు చంద్రుడు భువనచంద్ర అని తెలిపారు. తెలుగుశాఖ తరఫున భువనచంద్రను ఘనంగా సన్మానించారు. డా.పాండురంగం కాళియప్ప, ఎస్పీ వసంతలక్ష్మి,వూరా శశికళ, ఆచార్య శ్రీదేవి, డా.వాసిలి, డా.మాదా శంకరబాబు పాల్గొన్నారు.