
ల్యాప్‌టాప్ దొంగల అరెస్టు
రేణిగుంట: ఏర్పేడు మండలంలోని తిరుపతి ఐఐటీ ఇటీవల ల్యాప్‌టాప్‌ల దొంగతనానికి పాల్పడిన తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టుచేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రేణిగుంటలో గురువారం ఏఎస్పీ రవిమనోహరాచారి ఆ వివరాలను వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలతో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసుపై దర్యాప్తు చేపట్టి ఈనెల 27వ తేదీన ఏర్పేడు సీఐ బి.శ్రీకాంత్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి బృందం నేతృత్వంలో ల్యాప్‌టాప్‌ల చోరీలకు పాల్పడుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళ్ సెల్వన్, వీరాస్వామి గణేషన్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరు ఐఐటీ, మెడికల్ కళాశాలలో ల్యాప్‌టాప్‌లు చోరీకి పాల్పడుతున్నట్లు తెలిపారు. వారి నుంచి 8 లక్షల రూపాయలు విలువచేసే 15 ల్యాప్‌టాప్‌లు, 3 మొటైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులపై గతంలో సుమారు 500 ల్యాప్‌టాప్‌ల చోరీలపై 9 కేసులు ఉన్నాయని వివరించారు. నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి, అర్బన్ సీఐ జయచంద్ర, ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, పీఎస్‌ఐ ఇమామ్ హుస్సేన్, వెంకటలక్ష్మి, సిబ్బంది రాజశేఖర్, భారుషా, మహేంద్ర బాలు, మణి, మునేంద్ర, కార్తీక్ పాల్గొన్నారు.