
దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..!
సాక్షి, చైన్నె: వినాయక చవితి పండుగను రాష్ట్ర ప్రజలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వాడవాడలా గణనాథుడి విగ్రహాలను కొలువు దీర్చి పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని హిందూ మక్కల్ కట్చి, హిందూ మున్నని, శివసేన, బీజేపీలతో పాటు అనేక హిందూ సంఘాల నేతృత్వంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున విగ్రహాలను వాడవాడలలో కొలువుదీర్చారు. వినాయక చవితికి ఇళ్లల్లో ప్రత్యేక గణపయ్యను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. పిండి వంటకాలను ఆప్తులు, ఇరుగు పొరుగు వారికి పంచి పెట్టారు. పెద్దఎత్తున ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లి, ఇంటిళ్లి పాది ఆనందోత్సాహంతో పండుగ వేళను ప్రజలు గడిపారు. తమ తమ ఇళ్లల్లో పూజలందుకున్న వినాయకుడి ప్రతిమలను అధిక శాతం మంది తొలి రోజే నిమజ్జనం చేశారు. వివిధ రూపాల్లో గణపయ్య విగ్రహాలను రాష్ట్రవ్యాప్తంగా వాడవాడల్లో కొలువుదీర్చి పూజాధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కృష్ణగిరి జిల్లా హొసూరులో పార్లమెంట్ తరహాలో వినాయక మండపం తీర్చిదిద్దారు. ఇందులో స్పీకర్, పీఎం అంటూ సభ్యులందరూ వారి వారి స్థానాలలో కూర్చుని ఉన్న తరహాలో వివిధ ఆకృతులతో గణపయ్య విగ్రహాన్ని కొలువుదీర్చారు. ఇక, శుక్రవారం నుంచి మరికొన్ని చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించనున్నారు.
ఆలయాలలో..
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో, గ్రామగ్రామాన కొలువు దీరి ఉన్న వినాయకుడి విగ్రహాలు, తిరుచ్చిలో ప్రసిద్ధి చెందిన ఉచ్చి పిళ్లయార్ ఆలయం, కారైకుడి పిళ్లయార్ పట్టిలోని కర్పగ వినాయగర్ ఆలయం, తిరువారూర్ జిల్లా పూనతోట్టంలోని ఆది వినాయగర్, మదురైలోని ముక్కుర్ని వినా యగర్, తిరువయ్యారు, చిదంబరం, తంజావూరు, కోయంబత్తూరు, కుంభకోణంలోని అతి పెద్ద గణపయ్య ఆలయాల్లో ఉత్సవాలు, గణనాథుడి రథోత్సవం కనులపండువగా జరిగాయి. చైన్నెలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం పట్టినంబాక్కం శ్రీనివాసపురం బీచ్, నీలాంకరై, కాశిమేడు, తిరువొత్తియూరు, ఎన్నూరు బీచ్‌లలో ఈ ఏర్పాట్లు చేశారు. ఇక, ఈరోడ్, ఆర్కేవి రోడ్డు, వీరప్పంచద్రం, కొల్లపాలయంలలో, సేలంలో పలు చోట్ల వినూత్న ఆకృతులతో గణపయ్య విగ్రహాలను కొలువు దీర్చి పూజలందిస్తున్నారు.
వేలూరు, తిరువణ్ణామలైలో..
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలూరు జిల్లాలో మాత్రం రెండు వేల విగ్రహాలకు పైగా ప్రతిష్టించారు. తిరువణ్ణామలై జిల్లాలో 1,500 విగ్రహాలను ప్రతిష్టించారు. లోకక్షేమం కోసం ధన్వంతరి పీఠంలో యాగ పూజలు చేశారు.
తెలుగు లోగిళ్లలో వేడుకలు..
కొరుక్కుపేట: చైన్నెలోని తెలుగు లోగిళ్లలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. విఘ్నేశ్వరుడికి పూజలు, హోమాలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మట్టి గణపతులను కొలువుదీర్చి వినాయక పూజల్లో తెలుగువారు పాల్గొని గణనాఽథుని కృపకు పాత్రులయ్యారు.

దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..!

దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..!

దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..!

దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..!