
ఉయిరుళ్లవరై ఉష రీ రిలీజ్
తమిళసినిమా: బహు ముఖాలు కలిగిన టి.రాజేందర్ అనే విషయం తెలిసిందే. ఈయన తెరకెక్కించిన చిత్రాలన్నీ సంచలన విజయాన్ని సాధించినవే. కాగా ఆ చిత్రాలన్నిటిని ఇప్పుడు వరుసగా రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో ఒక చిత్రం ఉయిరుళ్లవరై ఉష. టి.రాజేందర్, నళిని, సరిత, రాధారవి, వెన్నిరాడై మూర్తి, గంగ, ఎస్ ఎస్ చంద్రన్, ఇడిచ్చ పులి, గాంధీమతి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి టి.రాజేందర్ కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, చాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఉషా రాజేంద్రన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం 1982లో విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమ కథాంశంతో ఈ చిత్రం తెలుగులోను ప్రేమసాగరం పేరుతో విడుదలై ఏడాదిపాటు ప్రదర్శింపబడింది. కాగా అలాంటి సూపర్ హిట్ చిత్రాన్ని మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, డిజిటల్ ఫార్మెట్లో సెప్టెంబర్‌లో రిలీజ్ చేయడానికి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టి.రాజేందర్ వెల్లడించారు. ఈ చిత్ర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం 38 రోజులు పని చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా తాను ఇంతకుముందు రూపొందించిన మైథిలి ఎన్నై కాదలీ, ఒరుతలైరాగం, ఎన్ తంగైకళ్యాణి, టీఆర్ సిలంబరసన్ కథానాయకుడిగా పరిచయమైన కాదల్ ఐళివదిల్లై, శరవణ, ఇదునమ్మఆళు, మోనీషా ఎన్‌మొనాలిసా, సొన్నాల్ దాన్ కాదలా, చిన్నం చిరువనాగ, ఎంగవీట్టు వేలన్ చిత్రాలను వరుసగా రీ రిలీజ్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం టీ ఆర్ టాకీస్ అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రీ రిలీజ్ చిత్రాల సలహాలను తన కుమారుడు చిలంబరసన్ ఇచ్చారని తెలిపారు. ఈసందర్భంగా ఉయిరుళ్లవరై ఉష చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.

ఉయిరుళ్లవరై ఉష రీ రిలీజ్