
ఈ చిత్రానికి రెండేళ్లు శ్రమించాం!
తమిళసినిమా: జీకేఆర్ సినీ ఆర్ట్స్ పతాకంపై కుట్రం పుదిదు అనే చిత్రాన్ని నిర్మించి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు తరుణ్ విజయ్. ఈయన తండ్రి కార్తికేయన్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ద్వారా నోవా ఆర్మ్‌స్ట్రాంగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి శాన్విత కనిమొళి నాయకిగా నటించిన ఇందులో మధుసూదన్‌రావు, నిళగల్ రవి, రామచంద్రన్ దురై, బాయ్స్ రాజన్, ప్రియదర్శిని రాజకుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. క్రైమ్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఈనెల 29న తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని ఉత్రా ప్రొడక్షన్‌న్స్ అధినేత హరిఉత్రా తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈసందర్భంగా కుట్రం పుదిదు చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఈ వేదికపై సహా నిర్మాత, కథానాయకుడి తండ్రి కార్తికేయన్ మాట్లాడుతూ ఈచిత్రం కోసం తాను, తన కుమారుడితో కలిసి రెండు ఏళ్లు శ్రమించానన్నారు. తరుణ్ విజయ్ మాట్లాడుతూ అమ్మ, నాన్నల ప్రోత్సాహం లేకుంటే తాను ఇక్కడ నిలబడేవాడినే కాదన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఒక తండ్రి కుమారుడిని హీరోగా పరిచయాలనుకుంటే ఒక ఇంట్లో సాంగ్, కలర్ ఫుల్ కథాశంతో కూడిన కమర్షియల్ కథా చిత్రంలో చూడాలనుకుంటారని, అయితే కార్తికేయన్ మాత్రం వైవిధ్య భరిత కథా చిత్రం చేశారని అన్నారు. ఉత్కంఠ భరితంగా సాగే థ్రిల్లర్ కథా చిత్రాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం అంత సులభం కాదన్నారు. కుట్రం పుదిదు చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.