
క్లుప్తంగా
జెండా పండుగకు
పటిష్ట బందోబస్తు
వేలూరు: స్వాతంత్య్ర దినోత్సవానికి వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎటువంటి తీవ్ర వాద శక్తులు జిల్లాకు రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా ఎస్పీ మయిల్‌వాగనం అద్యక్షతన వేలూరు జిల్లాలోని బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, సీఎంసీ స్థలాల్లో పోలీసులు నిఘా ఉంచారు. అదే విధంగా కాట్పాడి రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎస్పీ మయిల్‌వాగనం ఆంధ్ర సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా తిరువణ్ణామలై జిల్లాలోని అరుణాచలేశ్వరాలయం, బస్టాండ్ ముఖ్యకూడలి వద్ద పోలీసులు నిఘా ఉంచారు.
మామ హత్య..అల్లుడి అరెస్ట్
తిరువొత్తియూరు: భూమిని విక్రయించి వాటా ఇవ్వలేదని మామను హత్య చేసిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్లవరం సమీపంలోని పొళిచ్చలూరు, నెహ్రూ నగర్‌కు చెందిన రాజా. ఇతని భార్య శరణ్య. ఆమె స్వస్థలం తేని జిల్లా, కల్లుపట్టి. శరణ్య తండ్రి అళగర్‌సామి (55) కల్లుపట్టిలోని భూమిని విక్రయించినట్లు తెలిసింది. విక్రయించగా వచ్చిన నగదులో వాటా కావాలని రాజా అడిగాడు. అందుకు మామ అళగర్‌సామి నిరాకరించాడు. ఇదిలాఉండగా బుధవారం రాత్రి అళగర్‌సామి కుమార్తెను చూడడానికి పొళిచ్చలూరుకు వెళ్లాడు. ఆ సమయంలో మామతో అళగర్‌సామి గొడవపడ్డాడు. గొడవలో ఆగ్రహించిన రాజా ఇనుపరాడ్‌తో అళగర్‌సామిని కొట్టాడు. అళగర్‌సామి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. శంకర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి రాజాను అరెస్టు చేశారు.
యువకుడి హత్య
అన్నానగర్: మూతపడిన ప్రైవేట్ ఇనుప కంపెనీలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. చైన్నెలోని మాధవరంలో ఒక ప్రైవేట్ ఇనుప ఖనిజ మిల్లు ఉంది. రుణ సమస్యల కారణంగా దీనిని పదేళ్ల క్రితం సీజ్ చేశారు. ఈక్రమంలో గురువారం ఉదయం కంపెనీ నుంచి కేకలు వినిపించడంతో ఆ ప్రాంత ప్రజలు వెంటనే మాధవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా తీవ్రగాయాలతో ఒక యువకుడు చనిపోయి ఉన్నాడు. పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మృతుడు బర్మా కాలనీకి చెందిన పెయింటర్ చంద్రు (24) అని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తల్లిదండ్రుల ఆస్తిని
కాజేసిన కుమారుడి అరెస్టు
అన్నానగర్: సేలం జిల్లా ఎడప్పాడి యూనియన్ పరిధిలోని మొరసపట్టి గ్రామం అమ్మంగుట్టూరు ప్రాంతానికి చెందిన పెరుమాళ్ కౌండర్ (87) రైతు. ఇతని భార్య చెల్లమ్మాళ్. వీరికి ఇద్దరు కొడుకులు. ఈ స్థితిలో 16 ఎకరాల వ్యవసాయ భూమిని కలిగి ఉన్న పెరుమాళ్ గౌండర్ ఇటీవల తన ఇద్దరు కుమారులకు చెరో 7 ఎకరాలు పంచి ఇచ్చాడు. మిగిలిన 2 ఎకరాల భూమిని తన వద్ద ఉంచుకున్న పెరుమాళ్ గౌండర్ పెద్ద కుమారుడు రాజన్ అలియాస్ కుప్పుసామి మిగిలిన భూమిని తన పేరు మీద రిజిస్టర్ చేయమని అడిగి , తన తల్లిదండ్రులను నిరంతరం వేధించేవాడని తెలుస్తుంది. ఈ స్థితిలో, గత నెల 16న, వారిని బలవంతంగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లిన రాజన్, తన తండ్రి పేరు మీద ఉన్న ఎకరం వ్యవసాయ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయినా సంతృప్తి చెందని రాజన్, మిగిలిన భూమి కోసం తన తల్లిదండ్రులను వేధిస్తూనే ఉన్నాడని తెలుస్తుంది. దీంతో మనస్తాపానికి గురైన పెరుమాళ్ గౌండర్ తన కొడుకుపై పూలంపట్టి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని తర్వాత, తల్లిదండ్రులను నిరంతరం వేధిస్తున్న రాజన్‌ను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి, సంగగిరి బ్రాంచ్ జైలుకు తరలించారు.