
ఆడికృత్తిక వేడుకలు ప్రారంభం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడికృత్తిక తెప్పోత్సవ వేడుకలు అశ్వినితో గురువారం ప్రారంభమయ్యాయి. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ఆడికృత్తిక వేడుకలు అశ్వినితో ప్రారంభమై శుక్రవారం ఆడి భరణి, శనివారం ఆడికృత్తిక వేడుకలతోపాటు శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు కొండ ఆలయ శరవణ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం ఉదయం స్వామికి సుగంధద్రవ్యాలతో అభిషేక పూజలు చేసి వజ్రాభరణాలతో అలంకరించారు. కావడి మండపంలో విశేష పుష్పలంకరణలో శ్రీవళ్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లు కొలువుదీరగా షణ్ముఖర్‌కు 1,008 విల్వ ఆకులతో అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు కావళ్లతో కొండ ఆలయం చేరుకుని స్వామికి కావడి మండపంలో కావళ్లు చెల్లించి స్వామి దర్శనం చేసుకున్నారు. అశ్విని కావళ్లతో వేలాది మందం క్యూలో వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. నేడు ఆడి భరణి సందర్భంగా పటిష్ట బందోబస్తుకు ఎస్పీ వివేకానంద శుక్లా ఆదేశించారు. వేడుకలు సందర్భంగా కొండ ఆలయాన్ని పుష్పాలతో అలంకరించగా, విద్యుద్దీపాల కాంతుల్లో కొండ ఆలయం కళకళలాడుతోంది.

ఆడికృత్తిక వేడుకలు ప్రారంభం