
మ్యానిఫెస్టో ప్రకారం పెన్షన్ పెంచాలి
వేలూరు: ఎన్నికల మ్యానీఫెస్టో ప్రకారం 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు పది శాతం పెన్షన్ పెంచాలని తమిళనాడు రిటైర్డ్ స్కూల్, కళాశాల టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ సంఘం సమావేశం వేలూరులో జరిగింది. సమావేశంలో సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వ బస్సులో 40 శాతం రాయితీతో ప్రయాణం చేసేందుకు అనుమతించాలని, బీమా పథకంలో అవకతవకలను తొలగించడానికి కొత్త బీమా పథకాన్ని తీసుకు రావాలని, పెన్షన్ ప్యాకేజీ కాలాన్నీ 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కు తగ్గించాలన్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న వేలూరు టీచర్స్ భవనంలో టీచర్‌లకు సన్మానం చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. తీర్మాన పత్రాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారు లు మహాలింగం, మనోహరన్, రాణిపేట జిల్లా కా ర్యదర్శి అబ్దుల్ రహీం, మహిళా విభాగం కార్యదర్శి మంజుల, శోభ, జయదేవరెడ్డి, ఇళంగోవన్, వినాయకం, ఆరుముగం, సచ్చిదానందం పాల్గొన్నారు.