
పతంగుల పండుగ
– మహాబలిపురం సమీపంలో ఏర్పాటు
సాక్షి, చైన్నె : పతంగులు(గాలిపటాల) పండుగ చైన్నె శివారులలో ప్రారంభమైంది. తమిళనాడు పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మంత్రులు అన్బరసన్, రాజేంద్రన్ గురువారం ప్రారంభించారు. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని తిరువడందై బీచ్‌లో నాలుగో సంవత్సరంగా అంతర్జాతీయ స్థాయి గ్రాడ్యుయేషన్ ఫెస్టివల్‌గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 17వ తేదీ వరకు ఈ పతంగుల ఉత్సవం హోరెత్తనుంది. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, వియత్నాం, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, భారత దేశానికి చెందిన 250 మందికి పైగా తమ వినూత్న పతంగులను ఇక్కడ ఎగుర వేసి పోటీ పడే దిశగా పరుగులు తీస్తున్నారు. సూర్యకాంతిని కృత్రిమంగా ప్రతిబంబించే పతంగులు, వినూత్నంగా ప్రకాశించే రంగుల గాలి పటాలు, భారీ ఆక్టోపస్‌లు, వివిధ రకాల రోబోటిక్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు వరకు ఆకాశంలో గాలి పటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యే కళా ప్రదర్శనలకు పర్యాటక శాఖ ఏర్పాట్లుచేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్‌ఎస్ బాలాజీ, వరలక్ష్మి, మధుసూదనన్, చెంగల్పట్లు కలెక్టర్ స్నేహ, సబ్ కలెక్టర్ మాలతి హెలన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.