
వాటర్ మెట్రోతో సాగరంలో షికారు
సాక్షి, చైన్నె: సముద్రంలో షికారు అన్నది కన్యాకుమారిలో మాత్రమే ఉంది. దీనిని మరో పది ప్రాంతాలకు విస్తరించే విధంగా అధికారులు కార్యాచరణలో ఉన్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా చైన్నె శివారులోని కోవలం నుంచి నగరంలోని నేప్పియర్ వంతెన వరకు జలమార్గం రూపకల్పనకు కసరత్తు చేపట్టారు. వివరాలు.. సముద్రంలో షికారు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. కన్యాకుమారి ఒడ్డు నుంచి సముద్ర నడి బొడ్డులోని వివేకానంద రాక్ వరకు పూంబుహార్ పడవలలో షికారు కోసం జనం క్యూ కడుతుంటారు. ఇక నాగపట్నం నుంచి శ్రీలంక కాంగేశంకు చిన్న నౌక ఎప్పుడు బయలు దేరుతుందో, ఎప్పుడు రద్దు అవుతుందో చెప్పలేం. ఈ పరిస్థితులలో పర్యాటకంగా పది సముద్ర తీరప్రాంతాలను అభివృద్ధి పరిచే విధంగా వాటర్ మెట్రో ప్రాజెక్టుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. కేరళ రాష్ట్రం కొచ్చి సముద్ర తీరంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో తొలి విడతగా చైన్నెలో అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. చైన్నెలో ఆకాశం మార్గంలో పయనం, మెట్రో రైలు పయనం, ఎలక్ట్రిక్ రైలు పయనం,ఎంఆర్‌టీఎస్ రైలుపయనం, ఎంటీసీ బస్సులలో పయనం అంటూ రవాణా వ్యవస్థలు ఉన్నా, తొలిసారిగా జలమార్గంలో పయనానికి ఈ ప్రాజెక్టు ద్వారా కసరత్తులు చేస్తున్నారు.
తొలి విడతగా చైన్నెలో..
రాజధాని నగరం చైన్నెలో మెరీనా అతి పొడవైన సముద్ర తీరం అన్నది తెలిసిందే. ఇక్కడకు నిత్యం పర్యాటకులు తరలి వస్తుండటంతో అభివృద్ధి పనుల వేగంగా సాగుతున్నాయి. మెరీనా తదుపరి బీసెంట్ నగర్ బీచ్, ఆతర్వాత నీలాంకరై , కోవళం, మహాబలిపురం వరకు ఈసీఆర్‌రోడ్డు మార్గంలో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ తీరం వెంబడి ఉన్న బీచ్‌లకు బ్యూ ఫ్లాగ్ షిప్ కోసం ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి.
అభివృద్ధి ఆధునికతను సంతరించుకునేలా జరుగుతోంది. ఎన్నూరు ముఖ ద్వారా నుంచి మెరీనాను కలుపుతూ కోవళం వరకు ఉన్న సముద్ర తీరాలను ఒక్కో ప్రాంతానికి తగ్గట్టుగా ప్రత్యేకతను చాటేదిశగా ఈ కార్యాచరణ సాగుతోంది. చైన్నె సముద్ర తీర బీచ్ విస్తీర్ణం 51 కి.మీ దూరం పెంచుతూ, ఐదు క్లస్టర్లుగా ఈ సుందరీకరణ వైపుగా దృష్టి పెట్టి ఉన్నారు. అలాగే, చైన్నె మెరీనా తీరంలో రోప్ కార్ సేవలకు నిర్ణయించారు. మెరీనా బీచ్ నుంచి బీసెంటర్ నగర్ బీచ్ వరకు 4.6 కి.మీ దూరం సముద్ర తీరం వెంబడి రోప్ కార్ సేవకు పరిశీలన జరుగుతోంది. ఈ పరిస్థితులలో నేప్పియర్ వంతెన నుంచి కోవలం వరకు 53 కి.మీ దూరం జల మార్గంకు కసరత్తులు చేస్తున్నారు. జల మార్గం కోసం సముద్ర తీరంలో పరిశీలన, అవసరం అయితే, చోట్ల నిర్మాణాలు, బకింగ్‌హాం కాలువ పునరుద్దరణ వంటి పనులు చేపట్టే దిశగా జాయింట్ ట్రాన్స్ పోర్టు అథారిటీ, జల వనరులు, సముద్ర తీర వ్యవహారాల విభాగాల అధికారుల సమావేశంలో ఈ వాటర్ మెట్రో చర్చకు వచ్చినట్టు తాజాగా సమాచారాలు వెలువడ్డాయి.
ఒక్కో ప్రాజెక్టుకు సుమారు రూ. 3 వేల నుంచి 5 వేల కోట్లు అవసరం కానున్నట్టు అంచనా వేశారు. ఈ వాటర్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక రూపకల్పనకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. నేప్పియర్ వంతెన నుంచి కోవలం వరకు బోటు షికారు చైన్నె వాసులు, పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగించే రీతిలో నిర్మాణాలకు దిశగా పరిశీలనలో అధికారులు ఉండడం విశేషం.
కోవలం నుంచి నేప్పియర్ వంతెన వరకు జలమార్గం
53 కి.మీ దూరం తొలి విడత కార్యాచరణ

వాటర్ మెట్రోతో సాగరంలో షికారు