
చర్చలు విఫలం
– రిప్పన్ బిల్డింగ్ ఆవరణలో ఉత్కంఠ
సాక్షి,చైన్నె: మంత్రులతో కార్మికుల చర్చలు విఫలమయ్యాయి. రిప్పన్ బిల్డింగ్ ఆవరణలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బలగాలు రంగంలోకి దిగాయి. ఏ క్షణానైనా ఆందోళనకారులను అరెస్టు చేసి తరలించేందుకు సిద్ధమయ్యారు.
చైన్నెలోని రాయపురం, తిరువికానగర్ పరిధిలోని పారిశుధ్య పనుల నిర్వహణ ప్రైవేటుకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. వీరి ఆందోళనకు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. వ్యవహారం హైకోర్టుకు సైతం చేరింది. మంగళవారం కార్పొరేషన్ తరఫున కోర్టుకు వివరణ ఇచ్చారు. బుధవారం అన్ని వర్గాల తరఫున వాదనలు సాగాయి. చైన్నెలోని అన్ని మండలాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేటుపరం చేసి ఉంటే, ఈ రెండు మండలాలలో మాత్రమే ఎందుకు వివాదం చేస్తున్నారో అనే విషయాన్ని పరిగణించాలని కోర్టుకు సంబంధింత ప్రైవేటు సంస్థ వివరణ ఇచ్చింది. అదే సమయంలో జనసంచారంతో కూడిన సెంట్రల్ రైల్వేస్టేషన్ మార్గంలోని రిప్పన్ బిల్డింగ్ ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ఆందోళనకారులు దీక్ష చేస్తున్నారన్న వాదన కోర్టుకు చేరింది. చైన్నెలో ఎంపిక చేసిన స్థలాల్లోనే ఆందోళనలు చేయాలన్న నిబంధన ఉన్నా, కార్పొరేషన్ భవనం ఉందన్న ఒక్క కారణంగా రిప్పన్ బిల్డింగ్ వద్ద ఫుట్‌పాత్‌ను కార్మికులు ఆక్రమించడం ద్వారా తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొందని, పాదచారులకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు వాదనలు కోర్టు చేరడంతో న్యాయమూర్తి బెంచ్ ఈ విషయాన్ని పరిగణించింది. తీర్పును వాయిదా వేస్తూనే, ఫుట్‌పాత్‌లో దీక్ష చేస్తున్న కార్మికులను అక్కడి నుంచి తొలగించాలంటూ పోలీసులను ఆదేశించారు.
రంగంలోకి పోలీసులు
కోర్టు కార్మికులను అక్కడి నుంచి తొలగించాలని ఆదేశించడంతో పోలీసులు సాయంత్రం రంగంలోకి దిగారు. అదే సమయంలో మంత్రి నెహ్రూ, శేఖర్‌బాబు స్పందించారు. మారో మారు కార్మికులతో చర్చలకు సిద్ధమై రిప్పన్ బిల్డింగ్‌కు వచ్చారు. అయితే, కార్మికులు ఏ మాత్రం తగ్గలేదు. తాము నిరసన దీక్ష కొనసాగిస్తామని స్పష్టంచేసి బయటకు వచ్చేశారు. దీంతో రిప్పన్ బిల్డింగ్ పరిసరాలలో పోలీసులు మోహరించారు. కోర్టు సైతం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కార్మికులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని ఆదేశించారు. ఓ వైపు మార్గాన్ని మూసివేశారు. సెంట్రల్‌వైపు రాకపోకలన్నీ మరో మార్గంలోనే చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రిప్పన్ బిల్డింగ్ వద్దు ఉత్కంఠ తప్పలేదు. అర్థరాత్రి వేళ వీరిని అరెస్టుచేసి, మరోచోటకు తరలించే అవకాశాలు ఉన్నాయి.