27 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ
కొరుక్కుపేట: తాంబరం నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్‌ల్లో పనిచేస్తున్న 27 మంది పోలీసు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ తాంబరం నగర పోలీసు కమిషనర్ అభిన్ దినేష్ మోదక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తాంబరం నగర పోలీసు కమిషనరేట్ ఒక ప్రకటనలో పేర్కొంటూ క్రోమ్‌పేట లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌ను సెమ్మన్ చేరి లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్‌గా, కన్నగినగర్ లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్ దయాల్‌ను క్రోమ్‌పేట లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్‌గా, అలాగే పల్లికరనై ప్రోహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ నటరాజ్‌ను కన్నగి నగర్ లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్‌గా, పల్లావరం లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్ దినేష్‌ను పల్లికరనై ప్రొహిబిషన్ ఎన్ ఫోర్స్‌మెంట్ డివిజన్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే రాణిపేట ప్రాంతానికి చెందిన పళనివేలు అనే వ్యక్తిని పల్లావరం లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు.
ప్రశ్నాపత్రం లీకేజీ
● నెల్‌లై విశ్వ విద్యాలయ పరీక్ష రద్దు
తిరువొత్తియూరు: నెల్‌లై మనోన్మయం సుందరనార్ విశ్వ విద్యాలయం పరీక్షలకు సంబంధించి బీకాం ప్రశ్నాపత్రం లీక్ అయిందనే సమాచారం మేరకు మంగళవారం జరగాల్సిన ఒక సబ్జెక్టు పరీక్షను రద్దు చేశారు. నెల్‌లై మనోన్మణియం సుందరనార్ విశ్వ విద్యాలయం నియంత్రణలో వున్న నెల్‌లై, తూత్తుకుడి, తెన్‌కాశి, కుమరి అనే నాలుగు జిల్లాలలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాలలకు సెమిస్టర్ పరీక్షలు 99 కేంద్రాలలో జరుగుతున్నాయి. మంగళవారం బీకాం ఇండస్ట్రియల్ లా పరీక్ష నిర్వహించుటకు ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీ అయినట్టు వార్తలు వ్యాపించాయి. దీంతో పరీక్షను రద్దు చేసినట్లు విశ్వ విద్యాలయ పరీక్షా కంట్రోలర్ ప్రకటించారు. విశ్వ విద్యాలయం కమిటీ సమావేశమై తరువాత ఈ పరీక్షకు కొత్త తేదీని ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించిన సమాచారంపై వైస్ చాన్స్‌లర్ చంద్రశేఖర్ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రశ్నాపత్రం లీక్ గురించిన సమాచారం విశ్వ విద్యాలయాలు, కళాశాలల్లో కలకలం రేపింది.
ఉద్యోగ కల్పన లక్ష్యంగా విస్తృత ప్రణాళిక
సాక్షి, చైన్నె: ఉద్యోగ కల్పన లక్ష్యంగా విస్తృత ప్రణాళికతో ముందుకెళుతున్నామని సీఐఈఎల్ హెచ్ సర్వీసెస్ చైర్మన్ కే పాండియరాజన్ ప్రకటించారు. ఉద్యోగ మేళాలు, క్యాంపస్ సెలక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని, ఇందులో భాగంగా డీప్ టెక్ పేరిట ఆరు కొత్త సర్వీసులు, ఆరు కొత్త వేదికతో ముందుకెళ్లనున్నామని తెలిపారు. మంగళవారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఉద్యోగి జీవిత చక్రాన్ని రూపొందించడం, సాంకేతికతతో నడిచే హెచ్‌ఆర్ పరిష్కారాల దిశగా ముందుకెళుతున్న సీఐఈఎల్ హెచ్ సర్వీసు 2024 వార్షిక ఆదాయ వివరాలను ఆయన ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1504 కోట్లు ఆదాయం పెరిగిందని, ఇది 38.57 శాతం వృద్ధి అని వివరించారు. అటానమస్ ఏఐ ఏజెంట్లు, మెసిన్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, కంప్యూటర్ విజన్, జనరేటివ్ ఏఐ, బ్లాక్ చెయిన్‌తో సహా అత్యాధునిక డిప్ టెక్‌ను ఉపయోగించుకునే ఏఐ ఏజెంట్ ప్లాట్ ఫామ్‌లను తాము సిద్ధం చేస్తున్నామన్నారు. నిరంతర పరిశోధన, అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల మార్పునకు, హెచ్‌ఆర్ పరిష్కాలకు విస్తృత ప్రణాళికతో ముందుకెళుతున్నామని వివరించారు. ఐటీ, ఈపీఎస్,హెల్త్ రంగాల్లో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇన్ఫినిటీ స్కిల్ వంటి అంశాలు, సాంకేతిక ఆధారితంగా ఉద్యోగ కల్పనలను విస్తృతం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఈ సమావేశంలో ఆ సంస్థ ఎండీ ఆదిత్యనారాయణ్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు దురైస్వామి రాజీవ్ కృష్ణన్, ఇతర ప్రతినిధులు సౌరబ్ మోరీ, డిజిటల్ అధికారి నెల్సన్ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు సీజే కేఆర్ శ్రీరామ్ బదిలీ
●కొత్త సీజేగా శ్రీవత్సవ్
●కొలీజియం సిఫారసు
సాక్షి, చైన్నె : మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న కేఆర్ శ్రీరామ్‌ను బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కొత్త సీజేగా ఎంఎం శ్రీవత్సవను నియమిస్తూ సిఫారసు చేశారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తూ వచ్చిన ఎస్వీ గంగాపూర్వాల గత ఏడాది పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌గా సీనియర్ న్యాయవాది మహాదేవన్ వ్యవహరించారు. ఆయన్ని పదోన్నతిపై సుప్రీం కోర్టుకు పంపించడంతో మరో సీనియర్ కృష్ణకుమార్ హైకోర్టు ఇన్‌చార్జ్ సీజేగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరకు కొన్ని నెలల అనంతరం పూర్తి స్థాయిలో ప్రధాన న్యాయమూర్తిగా ముంబై హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి కేఆర్ శ్రీరామ్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో నియమించారు. మద్రాసు హైకోర్టు 34వ ప్రధాన న్యాయమూర్తిగా కేఆర్ శ్రీరామ్ కొనసాగుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ని రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీచేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అలాగే మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా చత్తీష్‌గడ్ సీజే ఎంఎం శ్రీవత్సవను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించగానే ఈ సిఫారసులు అమల్లోకి రానున్నాయి.


