బెంగళూరు ప్రభుత్వ బస్సు సేవలు కల్పించాలి
పళ్ళిపట్టు: నొచ్చిలి నుంచి బెంగళూరుకు ప్రభుత్వ బస్సు సేవలను కల్పించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే చంద్రన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం నొచ్చిలిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రన్‌ను నొచ్చిలికి చెందిన సంజీవిరాజు, సునీల్‌కుమార్ తదితరులు వినితిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పళ్లిపట్టు సమీపంలోని నొచ్చిలి పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది బెంగళూరులో స్థిరపడిన వారితో పాటు రోజు వారి కూలీ పనులకు వెళ్లి వచ్చేవారి సంఖ్య వందల్లో ఉందన్నారు. దీంతో బెంగళూరు నుంచి బలిజకండ్రిగ వరకు కర్ణాటక బస్సు నడుస్తుందన్నారు. అయితే నొచ్చిలి నుంచి బస్సు సేవలు లేకపోవడంతో గ్రామీణులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో చాలా కాలంగా ప్రభుత్వ బస్సు సేవల కోసం తమిళనాడులోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రవాణాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.


