కువైట్ విమానం రద్దు
కొరుక్కుపేట: ఇంజిన్ వైఫల్యం కారణంగా కువైట్ విమానం రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం తెల్లవారు జామున 1.50 గంటలకు చైన్నె నుంచి కువైట్ వెళ్లే విమానం 155 మంది ప్రయాణికులతో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమానం రన్ వేపైకి వెళ్లగానే పైలట్ విమానం ఇంజిన్ వైఫల్యం చెందిందని గుర్తించారు. దీంతో విమానాన్ని నిలిపివేశారు. సిబ్బంది ఇంజిన్ మరమ్మతు చేయడానికి ప్రయత్నించారు. అయితే సాధ్యం కాలేదు. దీంతో కువైట్ వెళ్లాల్సిన విమానం రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులందరికీ చైన్నెలోని వివిధ హోటళ్లలో వసతి కల్పించారు. సోమవారం రాత్రి విమానం మళ్లీ కువైట్‌కు బయలుదేరుతుందని ప్రకటించారు.
కారు ఢీకొని
ఇద్దరికీ తీవ్ర గాయాలు
తిరువొత్తియూరు: చైన్నెలోని ప్రైవేటు ఎంటర్‌టైన్మెంట్ కేంద్రం వద్ద కారు ఢీకొని కార్మికుడితో సహా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె ఈచంబాకం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ప్రైవేటు ఎంటర్‌టైన్మెంట్ కేంద్రం ఉంది. శనివారం రాత్రి ఇద్దరూ మద్యం మత్తులో మద్యం తాగి కారు నడిపారు. ఆ సమయంలో కారు అదుపు తప్పి రోడ్డుపై నడిచి వెళుతున్న ఈచంబాకం ప్రాంతానికి చెందిన ఓండివీరన్ (65), పాండియన్ (32)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చైన్నె రాయ పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడిపిన మూర్తి (32), మునుస్వామి (46)ను అరెస్టు చేశారు.
శరవేగంగా
నేమం చెరువు కరకట్ట పనులు
తిరువళ్లూరు: నేమం చెరువు కరకట్ట మరమ్మతు పనులు సుమారు రూ.15 కోట్ల వ్యయంతో శరవేగంగా చేస్తున్నారు. తిరువళ్లూరు జిల్లా నేమంలో పెద్ద చెరువు ఉంది. ఈ చెరువు కింద 450 హెక్టార్ల ఆయకట్టు ఉంది. అలాగే నేమం చెరువు మిగులు జలాలను చెమరంబాక్కం రిజర్వాయర్‌కు తరలిస్తారు. ఏళ్ల కిందట నిర్మించిన చెరువు కరకట్ట పాక్షికంగా దెబ్బతింది. దీంతో అదనపు నీటిని నిల్వ చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో దెబ్బతిన్న కరకట్టను బలోపేతం చేయడం, నేమం చెరువు నుంచి చెమరంబాక్కం రిజర్వాయర్‌కు వెళ్లే కాలువలో పూడికతీత, చెరువులో ముళ్ల పొదల తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం నుంచి రూ.15 కోట్లు కేటాయించాలని కోరుతూ నివేదికను పంపారు. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో కరకట్ట మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ పనులను మరో రెండు నెలలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.


