మోగిన రాజ్యసభ నగారా!
● రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న ఆరు స్థానాలు ● జూన్ 2 నుంచి నామినేషన్లు ● 19న ఎన్నికలు ● ఈసారి కమల్‌కు ఛాన్స్ ● వైగోకు అవకాశం దక్కేనా? ● అన్నాడీఎంకేలో సీటు కుస్తీ
రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యులు పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ పదవుల భర్తీకి ఎన్నికల నగారా సోమవారం ఢిల్లీలో మోగింది. ఆరు స్థానాలలో నాలుగు డీఎంకే ఖాతాలో చేరడం ఖాయం. ఈ దృష్ట్యా ఆ కూటమి తరపున మక్కల్ నీది మయ్యం నేత, నటుడు కమల్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక, ఈ కూటమిలోని ఎండీఎంకే నేత వైగోకు ఈ సారి ఛాన్స్ దక్కేనా..? అన్నది అనుమానంగా మారింది.
చంద్రశేఖర్
అబ్దుల్లా
షణ్ముగం
విల్సన్
వైగో
అన్బుమణి
సాక్షి, చైన్నె: రాష్ట్రం నుంచి రాజ్యసభలో 18 మంది సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇందులో డీఎంకేకు చెందిన 10 మంది రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఈ కూటమిలోని కాంగ్రెస్‌కు చెందిన ఒకరు, ఎండీఎంకేకు చెందిన మరొకరు సభ్యులుగా రాజ్యసభకు వెళ్లారు. ఇక అన్నాడీఎంకేకు చెందిన నలుగురు సభ్యులుగా ఉన్నారు. గతంలో తమ కూ టమిలో ఉన్న పీఎంకే ఒకటి, తమిళ మానిల కాంగ్రెస్‌కు ఒకటి చొప్పున రాజ్యసభను అన్నాడీఎంకే కేటాయించింది. ప్రస్తుతం ఈ 18 మందిలో ఆరు గురి పదవీ కాలం జూలైలలో ముగియనున్నది.
ఆరుగురు వీరే..
జూలై 24వ తేదీతో రాజ్యసభ పదవీ కాలం ముగియనున్న వారిలో డీఎంకేకు చెందిన విల్సన్, అబ్దుల్లా, షణ్ముగం, ఈ కూటమిలోని ఎండీఎంకేకు చెందిన వైగో ఉన్నారు. అలాగే అన్నాడీఎంకేకు చెందిన చంద్రశేఖరన్, గతంలో ఈ కూటమి ద్వారా సీటు దక్కించుకున్న పీఎంకే చెందిన అన్బుమణి ఉన్నారు. ఈ పదవుల భర్తీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఢిల్లీ వేదికగా నగారా మోగించింది.
నాలుగు డీఎంకేకు గ్యారంటీ
డీఎంకే కూటమికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు ఖాళీ కానున్న వాటిలో నాలుగు స్థానాలు మళ్లీ ఖాతాలో ఏకగ్రీవంగా పడడం ఖాయం. రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే సంఖ్య 234గా ఉంది. ఆ మేరకు ఒక్కో రాజ్యసభ సభ్యుడి ఎన్నికకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు అవశ్యం. అసెంబ్లీలో డీఎంకే కూటమి సంఖ్యా బలం 159గా ఉంది. ఇందులో డీఎంకే– 134, కాంగ్రెస్–17, సీపీఐ–2, సీపీఎం –2, వీసీకే–4 ఉండడంతో వీరి ఖాతాలో నాలుగు రాజ్యసభ పదవులు మళ్లీ పడ్డట్టే. అయితే ఈ నాలుగు స్థానాలు ఎవ్వరెవ్వరికి దక్కేనో అన్న చర్చ మొదలైంది. డీఎంకే పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి సీనియర్ న్యాయవాదిగా విల్సన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ దృష్ట్యా, ఆయనకు మళ్లీ ఛాన్స్ దక్కే అవకాశాలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ఇక, షణ్ముగం, అబ్దుల్లా స్థానంలో ఈ సారి కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకే సీఎం స్టాలిన్ అధికంగా మొగ్గు చూపుతున్నారన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. యువతకు ఈసారి రాజ్య సభ సీటు దక్కవచ్చు అన్న చర్చ డీఎంకేలో సాగుతోంది. ఇక, డీఎంకే కూటమిలోని ఎండీఎంకే నేత వైగోకు ఈసారి ఛాన్స్ అనుమానంగా మారింది. ఈ సీటును లోక్‌సభ ఎన్నికల పొత్తు కసరత్తులలో భాగంగా కూటమి ధర్మంగా మక్కల్ నీది మయ్యంకు అప్పగించడం ఖాయం. ఇప్పటికే కమల్‌ను రాజ్యసభకు పంపించాలన్న నినాదం మిన్నంటుతోంది. ఈ దృష్ట్యా, సీటు కమల్‌కు రిజర్వుడ్ అయినట్టే. అయితే, ఆయన రాజ్యసభకు వెళ్తారా? లేదా తన ప్రతినిధిని పంపిస్తారా? అన్న చర్చ కూడా మక్కల్ నీది మయ్యంలో సాగుతుండడం గమనార్హం. వైగో విషయానికి వస్తే, ఆయన వారసుడు దురై వయ్యాపురి డీఎంకే కూటమి తరపున తిరుచ్చి నుంచి లోక్‌సభ సభ్యుడిగా గత ఏడాది ఎన్నికయ్యారు. ఈ దృష్ట్యా, 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచార పిరంగిగా వైగోను ఉపయోగించుకునే దిశగా ఈ సారికి ఆయన పేరును రాజ్యసభకు పరిశీలించే అవకాశాలు ఉండక పోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరో సీటుపై సందిగ్ధత
అన్నాడీఎంకే ఖాతాలో ఓ సీటు చేరడం ఖాయం. ఈ స్థానం మీద ఇప్పటికే మాజీ మంత్రి, సీనియర్ నేత జయకుమార్ గురి పెట్టి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అయితే మరో సీటు విషయంలో సందిగ్ధత తప్పడం లేదు. అన్నాడీఎంకేకు 66 మంది సభ్యులు ఉన్నా, ఆ పార్టీలో చీలిక పుణ్యమా పలువురు ఎమ్మెల్యేలు మాజీ సీఎం పన్నీరు వెన్నంటి ఉన్నారు. ఇంకొందరు అసంతృప్తితో ఉన్నారు. ఈ దృష్ట్యా, మరో అభ్యర్థి విషయంలో కనీసం అదనంగా ఐదారుగురు ఎమ్మెల్యే బలాన్ని కలిగి ఉండాల్సిన అవశ్యంగా నెలకొంది. ఇక, ఈ కూటమిలోని బీజేపీకి నలుగురు సభ్యులు ఉన్నారు. ఇదే అదనుగా ఆ స్థానాన్ని తమకు అప్పగించాలని అన్నాడీఎంకేపై బీజేపీ పెద్దలు ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో గతంలో అన్నాడీఎంకే కూటమిలో ఉన్న పీఎంకేకు ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఈ పార్టీకి చెందిన అన్బుమణి పరిస్థితి తాజాగా అగమ్యగోచరమే. ఒక వేళ మళ్లీ అన్నాడీఎంకే కూటమిలోకి పీఎంకే చేరిన పక్షంలో ఆయనకు మళ్లీ ఛాన్స్ ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకమే. ఇక, లోక్‌సభ ఎన్నికల కూటమి ధర్మం మేరకు తమకు రాజ్యసభ ఇస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చినట్టు డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ పట్టుబడుతూ వస్తున్నారు. ప్రస్తుతం డీఎండీకే అన్నాడీఎంకే కూటమిలో లేదు. ఈ కారణంగా వారికి ఆ సీటు ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకమే. ఈ పరిణామాల నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికలలో మెగా కూటమి దిశగా వ్యూహాలకు పదును పెడుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఈ రెండో సీటు విషయంగా ఎలాంటి కసరత్తు చేస్తారో? వేచి చూడాల్సిందే.
జూన్ 19న ఎన్నిక
ఖాళీ కానున్న ఆరు స్థానాలకు గాను జూన్ 19న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఈ ఎన్నికలలో పోటీ చేయనున్న వారు జూన్ 2వ తేదీ నుంచి 9వ తేది వరకు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల అధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. ఆయన వద్దే నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 12వ తేదీ నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజు. సాధారణంగా రాజ్యసభ ఎన్నికలు ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు ఆయా కూటములు ఏకగ్రీవంగానే కై వసం చేసుకోవడం జరుగుతూ వస్తోంది. అయితే, ఎన్నికలలో పోటీ అనివార్యమైన పక్షంలో జూన్ 19వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది
మోగిన రాజ్యసభ నగారా!
మోగిన రాజ్యసభ నగారా!
మోగిన రాజ్యసభ నగారా!
మోగిన రాజ్యసభ నగారా!
మోగిన రాజ్యసభ నగారా!
మోగిన రాజ్యసభ నగారా!


