గోవింద నామస్మరణతో ‘కంచి’ పులకింత
సాక్షి, చైన్నె : గోవిందా...గోవిందా అన్న నామస్మరణతో శనివారం కాంచీపురం పులకించింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు రథోత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వివరాలు.. ఆథ్యాత్మిక నగరం కాంచీపురంలో వెలసిన వరద రాజ స్వామి ఆలయంలో ఈనెల 11 తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో వరద రాజ స్వామి వారు రోజూ ఉదయం, సాయంత్రం వేళలో వివిధ వాహనాలలో భక్తులకు దర్శనం ఇస్తూ వచ్చారు. ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్య ఘట్టం రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువ జాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా వరదరాజ స్వామి వారు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాల్ని ధరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. 73 అడుగులతో కూడిన రథంలో స్వామి వారు ఆశీనులై భక్తుల్ని కటాక్షించారు. ఈ రథోత్సవం అంగరంగ వైభంగా జరిగింది. లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి రథాన్ని లాగారు. గోవిందా..గోవింద అన్న నామస్మరణ కాంచీపురం వీధుల్లో మార్మోగాయి. భక్త జన సంద్రంతో కాంచీపురం పరిసరాలు పులకించాయి. రథోత్సవం సందర్భంగా భక్తుల సేవలో పలు సంస్థలు తరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. రథోత్సవం కారణంగా కాంచీపురంలో పలు మార్గాలలో ట్రాఫిక్ మార్పులు చేశారు.


