కాడువెట్టి చిత్రాన్ని నిషేధించాలి
తమిళసినిమా: కాడువెట్టి చిత్ర విడుదలను నిషేధించాలని వన్నియార్ సంఘం అధ్యక్షుడు, పాట్టాలి మక్కల్ కట్చి మాజీ శాసనసభ్యుడైన దివంగత జె.గురు, కళ్యాణి దంపతుల కూతురు విరుదాంబికై చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో జె.గురు బయోపిక్‌లో పాట్టాలి మక్కల్ కట్చి నాయకుడు రామదాసుకు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు గౌతమన్ కాడువెట్టి పేరుతో చిత్రంగా రూపొందించారు. జె.గురు మరణంలో తమకు చాలా సందేహాలు ఉన్నాయని, ఆయన భౌతిక కాయాన్ని చూడ్డానికి కూడా పాట్టాలి మక్కల్ కట్చి నాయకులు రాందాస్, అన్బుమణి రాందాస్ తమకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇదే విధంగా జె.గురు జీవిత చరిత్రను దర్శకుడు గౌతమన్ తప్పుగా చిత్రీకరించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. తమ అనుమతి లేకుండా జె.గురు జీవిత చరిత్రను చిత్రంగా తెరకెక్కించారని ఆరోపించారు. ఇప్పటికే చిత్ర ట్రైలర్, ఆడియోను విడుదల చేశారని, చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారని తెలిపారు. అందువల్ల కాడువెట్టి చిత్ర విడుదలను నిషేధించాలని కోరారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుధ ఈ నెల 15వ తేదీ లోపు వివరణ ఇవ్వాల్సిందిగా దర్శకుడు గౌతమన్‌కు నోటీసులు జారీ చేసి, విచారణను వాయిదా వేశారు.


