ద్వైపాక్షిక వర్తక ప్రోత్సహమే లక్ష్యం
సాక్షి, చైన్నె: ద్వైపాక్షిక వర్తక వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఇండోనేషియా నేతృత్వంలో చైన్నెలో ఇండోనేషియా ట్రేడ్ ప్రమోషన్ సెంటర్(ఐటీపీసీ)ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోని ఇండోనేషియా రాయబారి హెచ్.ఇనా కృష్ణమూర్తి రాయపేటలోని ఎక్స్‌ప్రెస్ అవెన్యూలో ఐటీపీసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను శనివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇండోనేషియా, భారతదేశం నుండి దౌత్య అధికారులు, వ్యాపార సంఘాలు, వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు సుమారు 100 మంది హాజరయ్యారు. వర్తక, వాణిజ్య ప్రోత్సహం, సాంస్కృతిక అవగాహన, ఆర్థిక సహకారం పెంపొందించడం లక్ష్యంగా, ఇండోనేషియా హస్తకళలు, సృజనాత్మక ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలవనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. తమిళనాడు అత్యంత పారిశ్రామికీకరణ చెందిన రాష్ట్రాలలో ఒకటిగా ఉండడంతో ఇండోనేషియాతో బలమైన వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐటీపీసీ చైన్నె డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ హయకల్, ఇండోనేషియా సీసీ ఏడీ వార్డోయ్, హెడ్ సెక్రటేరియట్ విజయకుమార్, డైరెక్టర్ నుగ్రుహొ ప్రియో ప్రట్మొ పాల్గొన్నారు.


