త్వరితగతిన ఆక్రమణలను తొలగించాలి
తిరువళ్లూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన శిరువాపురి మురుగన్ ఆలయానికి సమీపంలో వున్న ఆక్రమణలను తొలగించి భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ప్రతాప్ అధికారులను ఆదేశించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శిరువాపురి ఆలయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అభివృద్ధి పనులపై అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి ఎస్పీ శ్రీనివాసపెరుమాల్‌తో పాటూ రెవెన్యూ, దేవదాయశాఖ, విద్యుత్, రోడ్లు భవనాలశాఖకు చెందిన అధికారులు హాజరైయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ శిరువాపురి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం పలువురు అన్నదానం చేస్తున్నారు. తద్వారా అక్కడ రాకపోకలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాృతృత్వం చేయాలని భావించే సంస్థలు ఆహార భద్రతాశాఖ అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందిన తరువాతే అన్నదానం చేయాలన్నారు. భక్తులకు నాణ్యమైన భోజనాన్ని మాత్రమే అందించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు భారికేడ్లు ఏర్పాటు, ట్రాఫిక్‌కు సమస్యలు రాకుండా పార్కింగ్ ప్రదేశం నిర్ణయం, ఆలయం చుట్టూ వున్న ఆక్రమణల తొలగింపుతో పాటూ ఇతర చర్యలను వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు విశ్రాంతి గది, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటూ భక్తులకు ఇబ్బందుల లేకుండా ప్రసాధం కౌంటర్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ దేవదాయశాఖ వేలూరు రీజినల్ డిప్యూటీ కమిషనర్ అనిత, ఆర్డీఓ కనిమెళి, పీఏజీ వెంకట్రమణ పొన్నేరి తాహసీల్దార్ సోమసుందరం పాల్గొన్నారు.


