
విద్యార్థినులకు ఎస్‌కేపీసీ చేయూత
కొరుక్కుపేట: శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల యాజమాన్యం ఇద్దరు పేద విద్యార్థినులకు చేయూతనిచ్చింది. బీకాం(సిఎస్) చదువుతున్న పి.రక్షితకు మొదటి ఎండోమెంట్ ఫండ్ ఉచిత సీటును ప్రదానం చేయగా, బీకాం(జనరల్)కు చెందిన ఎ.నిహాకు మెరిటోరియస్ స్కాలర్‌షిప్‌ను అందించింది. ఎస్‌కేపీసీ సిల్వర్ జూబ్లీ అక్షయ ఎండోమెంట్ ఫండ్ ఆర్థికంగా వెనుకబడి, ప్రతిభావంతులైన విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ది చెందడానికి, వారి లక్ష్యాలను సాధించడానికి వీలుగా అందిస్తున్నామని కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్‌కుమార్ తెలిపారు. ఇంకా పేద వర్గాల విద్యార్థులకు విద్య అందుబాటులో ఉంచేందుకు కాలేజ్ మేనేజ్‌మెంట్ ఐదు ఉచిత సీట్లను అందిస్తుందన్నారు. 95శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన మెరిటోరియస్ విద్యార్థులకు 50 శాతం ఫీజు రాయితీ, తమిళాన్ని రెండో భాషగా ఎంచుకున్న విద్యార్థులకు 30 శాతం ఫీజు రాయితీ, క్రీడల్లో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు అందజేస్తున్నట్టు తెలిపారు. ఎస్‌కేపీసీ విద్యాసంస్థ ప్రభుత్వ, దాతృత్వ, ప్రైవేట్ సంస్థల నుండి స్కాలర్‌షిప్‌లు సమకూర్చి అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన వివరించారు.