కొత్త యాప్‌ ఆవిష్కరణ

వీల్‌చైర్‌లో సెంథిల్‌ బాలాజి  - Sakshi

సాక్షి చైన్నె : మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ లెర్నింగ్‌, మెడికల్‌ పీజీ ప్రిపరేషన్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకుని రావడానికి వీలుగా రూపొందించిన మెడేస్‌ సూపర్‌ యాప్‌ను బుధవారం చైన్నెలో ఆవిష్కరించారు. మణిపాల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ మెడికల్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ రంజన్‌పాయ్‌, గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవి పంచనందన్‌ ఈ యాప్‌ గురించి మీడియాకు వివరించారు. వైద్య విద్యకు సానుకూలం అంశాలను క్రోడీకరించడం లక్ష్యంగా విద్యార్థుల కోసం ఈ యాప్‌ను రూపొందించామన్నారు.

రూ.45 లక్షలతో స్కేటింగ్‌ రింగ్‌

కొరుక్కుపేట: సింగార చైన్నె 2.0 పథకం కింద జోన్‌ 177 పరధిలోని వేలచ్చేరి వీజీపీ సెల్వనగర్‌లోని బేతేల్‌ అవెన్యూలో రూ.45 లక్షల వ్యయంతో బీటిల్‌ పార్కు, జూనియర్‌ తరగతుల కోసం స్కేటింగ్‌ రింగ్‌ను ఏర్పాటు చేశారు . బుధవారం సాయంత్రం రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి సుబ్రమణ్యన్‌ పార్కు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన స్కేటింగ్‌ రింగ్‌ను ప్రారంభించారు. మంత్రి సుబ్రమణియన్‌ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని అన్నారు. ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌, ఎంఎల్‌ఏ ఆసన్‌ మౌలానా, మేయర్‌ ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

కరుక్కా వినోద్‌పై ఎన్‌ఐఏ కేసు

కస్టడీకి కసరత్తు

సాక్షి, చైన్నె: రాజ్‌భవన్‌పై పెట్రోబాంబు దాడి కేసులో అరెస్టయిన రౌడీ కరుక్కా వినోద్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. అతడ్ని తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు కసరత్తులు చేపట్టింది. గత నెల చైన్నె గిండిలోని రాజ్‌భవన్‌పై పెట్రోబాంబు దాడికి రౌడీ కరుక్కా వినోద్‌ పాల్పడిన విషయం తెలిసిందే. అతడిని అక్కడి భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఈ వ్యవహారం పెనుదుమారం రేపింది. ప్రభుత్వంపై బీజేపీ వర్గాలు నిందలు మోపడం వాదులాటకు దారి తీసింది. ఆగమేఘాలపై రౌడీ కరుక్కా వినోద్‌ను పోలీసులు అరెస్టు చేసి కట కటాలలో నెట్టడాన్ని రాజ్‌భవన్‌ సైతం విమర్శించింది. చివరకు అతడిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. అలాగే ఏడాది కాలం పాటు ఎలాంటి బెయిల్‌ లేకుండా అతడిని కటకటాలలోనే ఉంచే విధంగా గూండా చట్టాన్ని ప్రయోగించారు. అయితే, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఈ వ్యవహారాన్ని హోం శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. కరుక్కా వినోద్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ ఘటనపై విచారణకు ఎన్‌ఐఏ ప్రత్యేక బృందం రంగంలోకి దిగనుంది. కరుక్కా వినోద్‌ను తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఈ బృందం కసరత్తులు చేపట్టింది.

ఆస్పత్రిలో సెంథిల్‌ బాలాజి

సాక్షి, చైన్నె: మనీలాండరింగ్‌ కేసులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న మంత్రి సెంథిల్‌బాలాజి అనారోగ్యం బారినపడ్డారు. ఆయన్ను స్టాన్లీ ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం చేర్పించారు. ఆయనకు వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. మనీలాండరింగ్‌ కేసులో సెంథిల్‌ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు సమయంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనకు కావేరి ఆస్పత్రిలో బైపాస్‌ సర్జరీ జరిగింది. అనంతరం ఆయన్ను పుళల్‌ కేంద్ర కారాగారంలో బంధించారు. నెలన్నర రోజుల క్రితం ఆయన అనారోగ్యం బారినపడడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, నిబంధనలతో బెయిల్‌ మంజూరుచేయాలని పలు మార్లు కోర్టును సెంథిల్‌ తరఫు న్యాయవాదులు ఆశ్రయించారు. కింది కోర్టులు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈపరిస్థితులలో జుడిషియల్‌ కస్టడీలో పుళల్‌ జైల్లో ఉన్న సెంథిల్‌ బాలాజీ అనారోగ్యం బారినపడ్డారు. ఆయన్ను ప్రత్యేక అంబులెన్స్‌లో ఆగమేఘాలపై రాయపురంలోని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వ వైద్యులు ఆయనకు పరీక్షలు చేస్తున్నారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top